తెదేపా ప్రభుత్వాన్ని చిటికెలో కూల్చగలనని..లేదా ఏడాది…రెండేళ్ళలో అదే కూలిపోతుందని, అప్పుడు తనే ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పుతుండటం అందరికీ తెలిసిందే. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం గురించి జగన్ ఆవిధంగా మాట్లాడటాన్ని ఎవరూ సమర్ధించలేరు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిపోవాలని చాలా కోరిక ఉండవచ్చు. దాని కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రయత్నిస్తే ఎవరూ తప్పు పట్టరు కానీ పదేపదే ఈవిధంగా మాట్లాడుతుండటం వలన ఆయనకి ప్రజల తీర్పు, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఏమాత్రం గౌరవం లేదని, అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా వెనుకాడరని చాటి చెప్పుకొంటున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన నిన్న విశాఖకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆవిధంగానే మాట్లాడారు.
దానిపై తెదేపా అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్రంగా స్పందిస్తూ, “టర్కీ సైన్యం ప్రజా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తే, దానికి ప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పారో అందరూ చూశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకొన్న మా ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యమంత్రి అయిపోవాలని జగన్మోహన్ రెడ్డి చాలా పరితపించిపోతున్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని లేదా ఒకటి రెండు సం.లలో కూలిపోతుందని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పడం దానిని ఎన్నుకొన్న ప్రజలని, రాజ్యాంగాన్ని అవమానించడమే. ప్రజల విజ్ఞతని జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఆయనకి రాష్ట్ర ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారు. విశాఖలో రెండు వర్గాల మద్య జరుగుతున్న ఘర్షణలని పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే జగన్ పనికట్టుకొని అక్కడికి వెళ్లి ఒక వర్గాన్ని రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారు. అది మంచి పద్ధతి కాదు,” అని విమర్శించారు.
తెదేపా ప్రభుత్వం కూలిపోతుందనే జగన్ మాటలని టర్కీ తిరుగుబాటుతో పోల్చడం కొంచెం అతిగా ఉన్నప్పటికీ, అటువంటి పరిస్థితులు ఎక్కడ తలెత్తినా ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొంటారనే వాస్తవాన్ని దానిలో నుంచి స్వీకరించవచ్చు. ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నట్లయితే, దానిని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అందుకే జగన్ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అంతటితో ఆగకుండా ఆ సాకుతో దానిని కూల్చివేస్తాననో లేదా కూలిపోతుందనో చెప్పడమే చాలా తప్పు. ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తి చూపిస్తే చాలు. దానిలో మంచి చెడులు ప్రజలే నిర్ణయించుకోగలరు. ప్రజల విజ్ఞతని తక్కువగా అంచనా వేయడం సరికాదన్న డొక్కా అభిప్రాయం అక్షరాల నిజం. ప్రతిపక్షమే కాదు అధికార పార్టీ కూడా ఆ విషయం గుర్తుంచుకోవడం చాలా మంచిది.