అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ఎంచుకోవడం, దానితో సింగపూర్ సంస్థలకి లబ్ది కలిగించే విధంగా ఒప్పందాలు చేసుకోవడంపై రాష్ట్రంలో వైకాపాతో సహా ప్రతిపక్ష పార్టీలు, మీడియాలో ఒక వర్గం తీవ్రంగా విమర్శిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఆ విమర్శలపై తెదేపా అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందిస్తూ, “ఈ స్విస్ ఛాలెంజ్ పద్దతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి కొత్తగా కనుగొనలేదు. మీడియాలో ఒక వర్గం, ప్రతిపక్షాలు అదేదో చాలా తప్పుడు వ్యవహారం అన్నట్లుగా, దానిని ముఖ్యమంత్రి కనుగొని అమలుచేస్తున్నట్లుగా దాని గురించి చాలా చెడ్డగా ప్రచారం చేస్తూ ప్రజలని అయోమయానికి గురిచేస్తున్నాయి. వివిద రకాలైన ప్రభుత్వ పనులు చేయించుకోవడం కోసం ఇటువంటివి సుమారు 10 రకాల టెండర్ విధానాలున్నాయి. వాటిలో తమకి అత్యంత అనుకూలమైన వాటిని ప్రభుత్వాలు ఎంచుకొని ఆ పద్దతిలో పనులు చేయించుకొంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిలో స్విస్ ఛాలెంజ్ పద్దతిని ఎంచుకొంది. గతంలో హైదరాబాద్ లో పివి నరసింహరావు ఎక్స్ ప్రెస్ వేని ఇదే పద్దతిలో నిర్మించాము. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే శాఖలో కొన్ని పనులకి ఇదే విధానం అవలంభిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని పనులు స్విస్ ఛాలెంజ్ పద్దతిలోనే చేస్తోంది. కనుక స్విస్ ఛాలెంజ్ పద్దతిలో రాజధాని నిర్మించడమేమీ తప్పు కాదు..నేరం కాదు,” అని అన్నారు.
ప్రతిపక్షాలు, మీడియా ఈ స్విస్ ఛాలెంజ్ పద్దతిలో లోపాలని, దాని వలన వచ్చే సమస్యలని, రాష్ట్రానికి కలిగే నష్టాన్ని, సింగపూర్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. ఆ కారణంగానే అవి స్విస్ ఛాలెంజ్ పద్దతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి తప్ప దానిని చంద్రబాబు నాయుడు కనుగొన్నారనో లేదా ఆయన అమలుచేస్తున్నారనో కాదు. కనుక అవి వ్యక్తం చేస్తున్న సందేహాలకి డొక్కా వంటి తెదేపా ప్రతినిధులు సూటిగా సమాధానాలు చెప్పి వాటి అభ్యంతరాలు తప్పు అని రుజువు చేసి తమ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకొని ఉంటే బాగుండేది. కానీ ఆవిధంగా చేయకుండా దానిలో లోపాలని, అవినీతిని ప్రశ్నిస్తున్న వారిపై ఆగ్రహంతో ఎదురుదాడి చేస్తున్నారు. దాని వలన ప్రజలకి దానిపై ఇంకా అనుమానాలు పెరుగుతాయే తప్ప తగ్గవని గ్రహిస్తే మంచిది.
స్విస్ ఛాలెంజ్ పద్దతికి రాష్ట్రంలో వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుగా సాగితే చేజేతులా సమస్యలని తెచ్చుకొన్నట్లే అవవచ్చు. ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని, సింగపూర్ సంస్థలతో తన ఒప్పందాన్ని ప్రభుత్వం చాలా గట్టిగా సమర్ధించుకొంటున్నప్పుడు ప్రతిపక్షాలని, మీడియాతో ఒకసారి విస్త్రుత సమావేశం ఏర్పాటు చేసి వాటి సందేహాలని, వాటి అభ్యంతరాలని నివృతి చేస్తే తప్పేముంది? అందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది?