పార్లమెంటు సమావేశాలు మొదలవడంతో ఏపిలో రాజకీయ పార్టీలన్నీ నిద్రలో నుంచి లేచినట్లు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఏపిలో దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రత్యేక హోదా ఆధారంగానే రాష్ట్ర ప్రజలని ప్రసన్నం చేసుకొని రాష్ట్రంపై మళ్ళీ పట్టు సంపాదించుకోవాలని తాపత్రయపడుతోంది. కానీ రాష్ట్ర ప్రజలు దానిని నమ్మడం లేదు. అయినప్పటికీ అది ప్రత్యేక హోదా అంశాన్నే నమ్ముకొని ముందుకు సాగుతోంది. ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు పెట్టారు.
“కాంగ్రెస్ పార్టీకి దానిపై నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే, పార్టీ తరపునే బిల్లు పెట్టి ఉండేది కదా?” అనే అనుమానాన్ని అర్ధం లేనిదని జైరాం రమేష్ కొట్టిపడేశారు తప్ప పార్టీ తరపున ఎందుకు పెట్టలేదో చెప్పలేదు. ఈనెల 22న దానిపై పార్లమెంటులో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది కనుక తెదేపా, వైకాపాలతో సహా అన్ని పార్టీలు డానికి అనుకూలంగా ఓటు వేయాలని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కోరారు. దాని కోసం తమ పార్టీ అధిష్టానం పార్టీ సభ్యులకి విప్ జారీ చేయబోతోందని చెప్పారు. తెదేపా, వైకాపాలు కూడా విప్ జారీ చేసి ఆ బిల్లుకి అనుకూలంగా ఓట్లు వేయాలని కోరారు. తద్వారా ఆ రెండు పార్టీలు ఈవిషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.
వైకాపా ఇప్పటికే ఆ విషయం గురించి పార్లమెంటులో చాలాసార్లు మాట్లాడింది. ఈసారి తెదేపా కూడా దానిపై చర్చ జరపాలని కోరుతూ సెక్షన్: 193 క్రింద నోటీస్ కూడా ఇచ్చింది. వామ పక్షాలు కూడా ఏపికి ప్రత్యేక హోదా కావాలనే కోరుతున్నాయి. ఒక్క భాజపా తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కానీ వాటిలో ఏ ఒక్కటీ కూడా మిగిలిన పార్టీలకి సహకరించడానికి ఇష్టపడవు. ఎవరి గోల వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తుంటాయి. దీని కోసం కెవిపి పెట్టిన బిల్లుపై ఈనెల 22న పార్లమెంటులో ఓటింగ్ జరుగబోతోందని తెలిసిన తరువాత కూడా మళ్ళీ దానిపై సభలో చర్చ జరపాలని కోరుతూ తెదేపా నోటీస్ ఇవ్వడం అంటే అదే సూచిస్తోంది.
అందరూ ఒకే సమస్య పరిష్కారానికి పోరాడుతున్నా ఒకరికొకరు సహకరించుకోరు కానీ మిగిలిన అందరూ తమకే సహకరించాలని కోరుకొంటారు. రఘువీరా రెడ్డి మాటలు వింటే అది అర్ధం అవుతుంది.
మన పార్టీలు వ్యవహరిస్తున్న ఈ తీరు చూస్తుంటే, అవి ప్రత్యేక హోదా సాధించడం కోసం పోరాడుతున్నాయా లేక దాని కోసం తాము మాత్రమే పోరాడుతున్నామనే క్రెడిట్ కోసమే పోరాడుతున్నాయా? అని అనుమానం కలుగుతోంది. ఈ విషయంలో ఏపిలో పార్టీలకి చిత్తశుద్ధి లేదని కేంద్రప్రభుత్వం గ్రహించినందునే అది కూడా ఇచ్చిన హామీని అమలుచేయబోమని నిర్భయంగా చెప్పగలుగుతోంది.