ఇదివరకు పెళ్లి చూపులలో “అమ్మాయికి చదవడం, వ్రాయడం ఏమయినా వచ్చా?” అని మగపెళ్లివారు ప్రశ్నించడం అప్పుడు పెళ్లికూతురు పక్కనే ఉన్న తల్లో తండ్రో, “ఆ…మొగుడుకి ఉత్తరం ముక్క వ్రాసుకొనేంత చదివించాము లెండి,” అని జవాబు చెప్పడం జరిగేది. ఆ తరువాత కొన్ని దశాబ్దాల పాటు మహిళలే తెలుగు సాహితీ రంగాన్ని ఏలారు. కానీ మళ్ళీ ఇంగ్లీష్ చదువులు వచ్చేయడంతో పరిస్థితులు మొదటికొచ్చేశాయి. పైగా ఇప్పటి తరం పిల్లలకి ఆ ఉత్తరం ముక్క అంటే ఏమిటో కూడా తెలియదు. అందుకే ఇప్పుడు పెళ్ళిచూపులో ఎవరూ ఆ ఉత్తరం ముక్క ప్రసక్తి తేకుండా ఫేస్ బుక్ అకౌంట్ ఉందా లేదా? వాట్స్ అప్ అకౌంట్ ఉందా లేదా? అని మాత్రమే అడుగుతున్నారు. గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో ఇంగ్లీష్ చదువులు మూలంగా అన్ని రాష్ట్రాలలో ప్రజలూ కూడా క్రమంగా తమ తమ మాతృబాషలని మరిచిపోతున్నారు. (కానీ తమిళనాడు ప్రజలు మాత్రం దీనికి మినహాయింపు).
తెలుగువాళ్ళకి తాము తెలుగువాళ్ళమని చెప్పుకోవడానికే నామోషీ పడిపోతుంటారు కూడా. ఒకవేళ బలవంతంగా ఒప్పుకొన్నా తమకు తెలుగులో చదవడం వ్రాయడం రాదని చెప్పడం మరిచిపోరు అదేదో ఎడిషనల్ క్వాలిఫికేషన్ అన్నట్లు! కానీ అందుకు వాళ్ళనీ నిందించలేము. ఎందుకంటే గత రెండు మూడు దశాబ్దాలుగా తల్లి తండ్రులు, స్కూళ్ళు, కాలేజీలు అందరూ కలిసి పిల్లలని మార్కులు ఉత్పత్తి చేసే మెషిన్లగా మార్చేసారు తప్ప ఎవరూ కూడా తమ పిల్లలకి తమ మాతృబాషని నేర్పించాలనుకోవడంలేదు. ప్రవాస భారతీయులు మాత్రం తమ పిల్లలకు మాతృ బాషను, సంస్కృతీ సంప్రదాయాలను నేర్పిస్తున్నారు. అంటే దేశంలో కంటే విదేశీ గడ్డ మీదే మన మాతృబాషలు ఇంకా సజీవంగా ఉన్నాయని అర్ధం అవుతోంది. కనుక భవిష్యతులో మాతృబాష నేర్చుకోవడానికి పిల్లలు విదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదు.
ఇంతకీ విషయంలోకి వస్తే రాహుల్ గాంధీ కూడా హిందీలో చాలా బాగానే మాట్లాడుతారు. అనర్గళంగా రాజకీయ ప్రసంగాలు కూడా దంచుతుంటాడు. గత రెండు వారాలుగా జరిగిన పార్లమెంటు సమావేశాలలో అస్సలు కునుకే తీయకుండా తనకంటే చాలా అద్భుతంగా ప్రసంగించగల ప్రధాని మోడీని, సుష్మా స్వరాజ్ లను హిందీలో ఎడాపెడా కడిగిపారేస్తుంటే వాళ్ళిద్దరూ నోరెత్తితే ఒట్టు. ఆయన హిందీలో సుష్మ స్వరాజ్ ని తిట్టిపోస్తుంటే, ఆమె పక్కనే కూర్చొన్న లాల్ కృష్ణ అద్వానీ ఆ తిట్లు భరించలేక కంట తడిపెట్టుకొన్నారుట! రాహుల్ గాంధీకి హిందీలో అంత గొప్ప కమాండ్ ఉందని అప్పుడే అందరికీ అర్ధమయింది. కానీ ఆయన గొప్పదనాన్ని బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు కనుక రాహుల్ గాంధీ తిట్లు విని కాదు ఆయన ఏడ్చింది…మా సుష్మమ్మ తిట్టిన తిట్లకే ఆయన కన్నీళ్ళు పెట్టుకొన్నారని సర్దిచెప్పుకొన్నారు.
సరే! ఆ సంగతి ఎలా ఉన్నా ఈ సందర్భంగా మరో రహస్యం బయటపడిపోయింది. రాహుల్ గాంధీ హిందీలో మాట్లాడే ప్రతీ ముక్కని ఇంగ్లీషులో వ్రాసుకొస్తారనే రహస్యం బయటపడిపోయింది. అంటే సగటు భారతీయులే కాదు చివరికి రాహుల్ గాంధీకి కూడా హిందీ చదవడం వ్రాయడం రాదన్న మాట! కొడుకు కంటే తల్లే నయం కదా? ఆమె ఇటలీ దేశస్తురాలయినా హిందీలో మాట్లాడటం నేర్చుకొన్నారు. ఇటలీ బాషలోనో మరో బాషలోనో ఆమె తన హిందీ ప్రసంగా పాఠాన్ని వ్రాసుకొనయినా ఎంచక్కా హిందీలో ప్రసంగాలు చేస్తున్నారు. కానీ దేశాన్ని ఏలేయాలనుకొన్న యువరాజా వారికి మాత్రం హిందీ చదవడం వ్రాయడం రాదు.