రికార్డు స్థాయి లో అతి తక్కువ వ్యవధిలో పట్టిసీమను పూర్తి చేశామని.. నదుల అనుసంధానం అయిపోయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రకటించుకుంటున్నారు. ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఈ ప్రాజెక్టు విషయంలో ఫలితాలు ఏ మేరకు అందుతాయో కానీ.. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం పట్టిసీమను ఒక దిగ్విజయంగా అభివర్ణిస్తున్నాయి. ఆఖరికి బీజేపీ నేతలు కూడా పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా తెలుగుదేశం దేన్నీ పట్టించుకోకుండానే ముందుకు సాగింది.
పట్టిసీమ తో సక్సెస్ అయినట్టుగా ప్రకటించుకుంటున్న బాబు సర్కారు ఇప్పుడు ఇదే తరహాలో మరో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఇది కూడా ఎత్తిపోతల పథకమే. గోదావరి నీళ్ల మీద ఆధారపడిన పథకమే. పోలవరం ఎడమ కాల్వ మీద ఆధారపడ్డ పథకమే. దీని ద్వారా 35 టీఎంసీ ల నీళ్లను 53 వేల ఎకరాలను అందిస్తామని ప్రణాళికలో పేర్కొంటున్నారు. ఈ ఎత్తిపోతల పకథానికి అయ్యే ఖర్చును దాదాపు వెయ్యి కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఈప్రాజెక్టు ద్వారా విశాఖకు తాగునీరు అందించే ప్రణాళిక ఉంది.
ఈ మేరకు త్వరలోనే దీనికి నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారని, ఆగస్టులో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కూడా పట్టిసీమ పై వచ్చిన విమర్శలే వచ్చే అవకాశాలున్నాయి. పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. ఇలాంటి ప్రాజెక్టులతో సమయాన్ని, డబ్బును వృథా చేస్తున్నారనే ఆరోపణలు రావొచ్చు. వైఎస్ హయాంలో దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తి అయిన పోలవరం ఎడమకాల్వ ఆధారంగా చేసుకుని నిర్మించనున్న ఈ ప్రాజెక్టు గురించి పెద్ద దుమారమే రేపే అవకాశాలున్నాయి.