పాతబస్తీలో పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాదులకి న్యాయసహాయం చేస్తానని చెప్పుకొని, తద్వారా దేశంలో ముస్లింలకి అండగా నిలబడే పార్టీ తమదేనని చాటుకొని ముస్లిం ప్రజలని ఆకట్టుకోవాలని మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆయుధాలు, ప్రేలుడు సామాగ్రితో సహా పట్టుబడ్డ ఉగ్రవాదులకి న్యాయసహాయం చేస్తానని చెప్పినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ విమర్శలు ఎదుర్కోవలసి వచ్చినా, వాటి వలన కూడా ముస్లిం ప్రజలకి తనపై మరింత సానుభూతి, సదాభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని గ్రహించిన అసదుద్దీన్ ఒవైసీ, తన హామీని మళ్ళీ గట్టిగా పునరుద్ఘాటించారు. దాని వలన ఆయనకి రాజకీయ మైలేజి ఏమైనా పెరిగిందో లేదో తెలియదు కానీ అరెస్ట్ కాబడిన ఐసిస్ ఉగ్రవాదుల కుటుంబాలు ఆయనపై విరుచుకుపడి ఒవైసీకి పెద్ద షాక్ ఇచ్చాయి.
ఆయన తమ పిల్లలకి న్యాయసహాయం చేస్తానని చెప్పుకొంటూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని, దేశంలో ఇతర పార్టీల లాగే మజ్లీస్ పార్టీ కూడా ఈ తప్పుడు కేసు నుంచి రాజకీయ మైలేజ్ కోసం తాపత్రయపడుతోందని అరెస్ట్ కాబడిన ఇబ్రహీం యజ్దానీ అలియాస్ ఇలియాస్ యజ్దానీ కుటుంబ సభ్యులు విమర్శించారు. ఎన్.ఐ.ఏ. తమ కుమారుడిపై తప్పుడు కేసు నమోదు చేసి మనవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడితే, దానిని మజ్లీస్ పార్టీతో సహా అన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని వారు ఆరోపించారు. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మతం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ముస్లిం ప్రజల మనోభావాలని దెబ్బ తీస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. కనుక తమకి ఆయన న్యాయ సహాయం అవసరం లేదని తేల్చి చెప్పారు.
అంతేకాదు వారు రాష్ట్ర మానవహక్కుల సంఘంలో రెండు వేర్వేరు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఒక దానిలో తమ కుమారుడిపై తప్పుడు కేసు పెట్టారని పిర్యాదు చేస్తూ ఎన్.ఐ.ఏ., కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తెలంగాణ పోలీస్ డీజీపీ, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శులని ప్రతివాదులుగా చేర్చారు. మరొక పిటిషన్ లో తమ కొడుకుపై తప్పుడు కేసు పెట్టి అతని భవిష్యత్ దెబ్బ తీసినందుకు గాను కేంద్రప్రభుత్వం నుంచి కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
ఈ వ్యవహారంలో రాజకీయ మైలేజి పొందాలని ప్రయత్నించి అసదుద్దీన్ ఒవైసీ భంగపడటం ఒక విశేషమైతే, మారణాయుధాలతో పట్టుబడినప్పటికీ తమ కొడుకు నిర్దోషి అని, ఎన్.ఐ.ఏ. తప్పుడు కేసులు పెట్టిందని కనుక కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించమని కోరడం మరీ విచిత్రంగా ఉంది. చాలా తీవ్రమైన ఇటువంటి దేశద్రోహం కేసులలో వారు ప్రభుత్వాలపైన, పోలీసులపైనే కేసులు పెట్టడం, నష్టపరిహారం కోసం డిమాండ్ చేయడం చూస్తుంటే ఇటువంటివి కేవలం మన భారతదేశంలో మాత్రమే సాధ్యమేమోననిపిస్తుంది.