అమరావతిలో కోర్ క్యాపిటల్ నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీ అసెండాస్ సింగ్బ్రిడ్జి-సెంబ్కార్ప్కు కట్టబెట్టేందుకు జరుగుతున్న తతంగాన్ని స్విస్ చాలెంజి అంటున్నారు. నిజానికి అక్కడ ఛాలెంజి ఏమీ లేదు. ముందుగానే మంతనాలు జరిపి ప్రదక్షిణలు చేసి అస్మదీయ విదేశీయ కంపెనీతో ఒక ప్రతిపాదన వేయించారు. అందులో కొన్ని విషయాలే బయిటపెట్టి కీలకమైనవి తొక్కి పట్టి మిగిలినవారిని పోటీ పడమంటున్నారు! వారు ఎంత పెట్టుబడిపెడతారో ఎప్పటిలోగా తీసుకొస్తారో తెలియదు. ఆదాయంలో వారి వాటా ఎంతో తెలియదు. పోటీకి సంబంధించిన అంశాలన్నీ ఖాళీలు పెట్టి నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో అంశాలన్నీ సింగపూర్ కంపెనీ మనకు పెడుతున్న షరతులు తప్ప మన ప్రభుత్వం వారికి పెడుతున్న షరతులు కాదు. అందుకే ఇది రివర్స్ చాలెంజి. ఉదాహరణకు వారికి 1690 ఎకరాల భూమి అప్పగించడమే గాక 5,500 కోట్ల ఖర్చుతో ఇన్ఫ్రా సదుపాయాలు కల్పించాలి. ఆ భూమి మొత్తం అమ్ముడయ్యే వరకు ఇతర చోట్ల అభివృద్ది చేసి అమ్మకూడదు.అనుకున్న ప్రకారం సీడ్ కాపిటల్ ప్రాంతంలో నివాసాల నుంచి శ్మశానాల వరకూ తొలగించి వారికి హస్తగతం చేయాలి.ఒకవేళ అనుకున్న ప్రకారం అమ్ముడై లాభాలు రాకపోతే బైబ్యాక్ పద్ధతిలో ప్రభుత్వమే తీసుకోవాలి. ఒప్పందంలో నిబంధనల గడువు నాటికి ఆ వసతులు కల్పించలేకపోతే ఎదురు నష్టపరిహారం ఇవ్వాలి.ఇవీ ఇలాటివి అనేక ఏకపక్ష షరతులు నోటిఫికేషన్లో వున్నాయి. అసలు స్విస్ చాలెంజి విధానమే తప్పని కేంద్ర ప్రభుత్వం నియమించిన కేల్కర్కమిటీ చెప్పింది. ఏవో అసాధారణ నిర్మాణాలకు మాత్రమే దాన్ని వినియోగిస్తారు. కాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్విస్ చాలెంజి సూత్రాలను కూడా సరిగ్గా పాటించడం లేదు. మొదటి పోటీదారు ఆమోదించిన వివరాలన్నీ బయిటపెట్టి వాటిని మించి చేయడానికి సిద్ధంగా వున్న ఇతరులను తమ ప్రతిపాదనలతో రమ్మని ఆహ్వానించాలని సుప్రీం కోర్టు నిర్దేశించింది. కాని ఇక్కడ మొదటి సంస్థ కమిట్మెంట్లన్నీ గుట్టుగా అట్టిపెట్టి ఇతరులను చెప్పమంటున్నారు. తీరా ఇతరులు కోట్ చేసిన తర్వాత అవి లీక్ కావనే గ్యారంటీ లేదు. ఎందుకంటే మొదటివారి వివరాలు తెలియవు గనక అంతకన్నా కాస్తతగ్గించి తర్వాత బయిటపెట్టవచ్చు. పారదర్శకత లేనప్పుడు అలాటి అవకతవకలకు చాలా అవకాశం వుంటుంది.
ఈ విమర్శలన్నీ మీడియాలో వచ్చాక ప్రభుత్వం నష్టనివారణ(డామేజీ కంట్రోలు) మొదలు పెట్టింది. ఒక ‘అగ్ర’పత్రిక అసలు సీడ్ కాపిటల్ ఎందుకు అన్నిటికన్నా ముఖ్యమో ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇందులో ఒక్క అక్షరమైనా విమర్శనాత్మకంగా లేకపోగా ఇది ప్రాణవాయువు గనక కఠినషరతులు వుండొచ్చని సమర్థించేందుకే ఉద్దేశించినట్టుందని పరిశీలకులు భావిస్తున్నారు.