సినిమా సినిమాకీ తన రేంజు పెంచుకొంటూ వెళ్తున్నాడు సాయిధరమ్ తేజ్. సుప్రీమ్ తో మాస్‌కి మరింత దగ్గరైపోయాడు. ఈసినిమా దాదాపుగా రూ.20 కోట్లకు పైగానే వసూలు చేసింది. దాంతో సాయి నాలుగో సినిమాకే రూ.20 కోట్ల హీరో అయిపోయాడు. ఆ నమ్మకంతోనే ‘తిక్క’ సినిమాపై నిర్మాతలు భారీగా పెట్టుబడి పెట్టేశారు. రూ.12 కోట్ల బడ్జెట్‌తో మొదలైన సినిమా ఇది. కానీ రాను రాను బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదన్న ఉద్దేశంతో పాటు.. సుప్రీమ్ 20 కోట్లు వసూలు చేసి నమ్మకాన్ని పెంచడంతో తిక్క బడ్జెట్ పెరుగుతూ వెళ్లిపోయిందట. ఈ సినిమాపై ఇప్పటి వరకూ 22 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. పబ్లిసిటీ కోసం మరో కోటి రూపాయలైనా పెట్టాల్సిందే. అంటే.. రూ.23 కోట్ల బడ్జెట్ అవుతుందన్నమాట. మరి ఇంతా తిరిగి రాబట్టుకొంటుందా? తేజూకి ఆ స్టామినా ఉందా? అనేవి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
‘సుప్రీమ్’ దిల్‌రాజు బ్యానర్ నుంచి వచ్చిన సినిమా. పైగా సమ్మర్ రిలీజ్. దాంతో ఆ సినిమాకి మంచి వసూళ్లొచ్చాయి. దానికి తోడు అనిల్ రావిపూడి తొలి సినిమా పటాస్ సూపర్ హిట్టు. దాంతో సుప్రీమ్కి క్రేజ్ పెరిగింది. తిక్క విషయానికొస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఈ సినిమా దర్శకుడు సునీల్‌రెడ్డి ఓం అనే ఫ్లాప్ సినిమా తీశాడు. నిర్మాతలూ కొత్తవారే. హీరోయిన్లకు క్రేజ్ లేదు. వెరసి ఈ సినిమా బాధ్యతంతా తేజూ నే మోయాలి. తిక్కకి ఓపెనింగ్స్ వచ్చాయంటే.. అది తేజూ మహిమే అనుకోవాలి. అలాంటిది రూ.23 కోట్లు దాటి తిక్క వసూలు చేయగలదా?? అనేది ట్రేడ్ వర్గాల అనుమానం. మరి సాయి ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.