తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో బారీ అవినీతి జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కెటిఆర్ చాలా ఘాటుగా స్పందించారు. “దేశాన్ని 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశం కోసం చేసిందేమీ లేదు కానీ ఆకాశం నుంచి పాతాళం వరకు దేనినీ వదలిపెట్టకుండా అన్నిటినీ దోచుకొంది. దాని అవినీతి గురించి ఎన్ని పుస్తకాలు వ్రాసినా సరిపోవు. దానిని కాంగ్రెస్ అని కాకుండా స్కాంగ్రెస్ పార్టీ అని పిలవాలి. పచ్చ కామర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందన్నట్లుగా, అవినీతి, కమీషన్లకి అలవాటు పడిపోయిన కాంగ్రెస్ నేతలకి లోకంలో అందరూ తమలాగే ఉంటారని అనుకొంటుంటారు. తెలంగాణా కోసం పోరాడిన తెరాస ఎటువంటిదో ప్రజలకి తెలుసు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రానికి మేలు చేయాలని ప్రయత్నిస్తుంటే బుద్ధి జ్ఞానం లేని కాంగ్రెస్ నేతలు దానికి అడ్డుపడుతున్నారు. హరియాణాలో పరిస్థితులకి తెలంగాణాలో పరిస్థితులకి చాలా తేడా ఉందనే సంగతి కూడా తెలుసుకోకుండా సాగునీటి ప్రాజెక్టుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టులని కాదు ముందు వాళ్ళ మైండ్లని రీ డిజైన్ చెయ్యాలి. కాంగ్రెస్ పార్టీ ఒక పనికిమాలిన చెత్త పార్టీ. దానిలో ఉన్నవారు పనికిమాలిన నేతలు. అభివృద్ధికి అడ్డుపడుతున్న వారికి ప్రజలే గట్టిగా బుద్ధి చెపుతారు,” అని కెటిఆర్ అన్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పేరులోనే దేశభక్తి పొంగిపొరలేది. ఆ పార్టీలో ఎందరో మహానుబావులు, గొప్ప గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు, నీతినిజాయితీ, నిరాడంబరతకి నిలువెత్తు నిదర్శనంగా కనబడేవారు. భారతమాత సంకెళ్ళు తెంపి దేశానికి స్వేచ్చా వాయువులు ప్రసాదించిన గొప్ప పార్టీగా కాంగ్రెస్ పార్టీ అజరామరమైన కీర్తి ప్రతిష్టలు స్వంతం చేసుకొంది.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి.. కుంభకోణాలు..అసమర్ధత..ఇవే గుర్తుకువస్తాయి. కనుక దాని గురించి కెటిఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఎవరూ విభేదించకపోవచ్చు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళయిన తరువాత కూడా నేటికీ కాంగ్రెస్ అవినీతి భాగోతాలు బయటపడుతూనే ఉండటం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏమేరకు విస్తరించిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే దానికి స్కాంగ్రెస్ పార్టీ అని కెటిఆర్ అన్నారు. అదొక పనికిమాలిన పార్టీ అని దానిలో ఉన్నవారు చెత్త అని అన్నారు.
అయితే ఇక్కడే అందరికీ ఒక ధర్మ సందేహం కలుగుతుంది. అదే స్కాంగ్రెస్ పార్టీలో నుంచి అదే చెత్త, అవినీతిపరులు, అసమర్దులైన కాంగ్రెస్ నేతలని తెరాసలోకి ఎందుకు చేర్చుకొంటున్నారు? అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పనికిరాని చెత్త, అవినీతిపరులుగా ఉన్నవాళ్ళు తెరాసలో చేరిపోగానే సమర్ధులు, నిజాయితీపరులు అయిపోతారా? కెటిఆర్ వివరిస్తే బాగుంటుంది.