తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మాకేమి అభ్యంతఃరం లేదు. దానికి మేము కూడా మద్దతు ఇస్తాము. రెండు రాష్ట్రాలలో ఉన్నది తెలుగువారే కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే మేము చాలా సంతోషిస్తామని చెప్పేవారు. కొన్ని నెలలఆ తరువాత ఆ స్టేట్మెంట్ కి కొన్ని సవరణ లేదా షరతుని జోడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఏపికి ఇస్తే తెలంగాణాకి కూడా ఇవ్వాలి అనే ఒక షరతు జోడించారు.
మంత్రి కెటిఆర్ దానికి మళ్ళీ తాజా సవరణ చేసి, “ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోరుతూ కెవిపి రామచంద్రరావు పెట్టిన ప్రైవేట్ బిల్లుకి మేము మద్దతు ఇస్తామని మేము చెప్పలేదు. హైకోర్టు విభజనకైతేనే మద్దతు ఇస్తామని చెప్పాము,” అని స్పష్టం చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కడం తెరాసకి ఇష్టం లేదని స్పష్టం అయింది. అందుకే దానికి మద్దతు ఇవ్వమని చెప్పినట్లు భావించవచ్చు. అందుకు చాలా కారణాలు ఉండవచ్చు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి తమ హక్కులని సాధించుకోవడం కోసం, ప్రయోజనాలని కాపాడుకోవడం కోసం కేంద్రప్రభుత్వంపై కలిసి పోరాడుదామని తెరాస నేతలు చెపుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చే ప్రత్యేక హోదా సాధించుకొనేందుకు మాత్రం వారు సహకరించరు. హైకోర్టు విభజన తమకి చాలా అత్యవసరం కనుక దానికి మాత్రమే మద్దతు ఇస్తారని అర్ధం అవుతోంది. మరి అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రం తెలంగాణాకి ఆ విషయంలో ఎందుకు సహకరిస్తుంది? అని ఆలోచిస్తే మంచిది. ఏమైనప్పటికీ కేంద్రప్రభుత్వమే ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగా లేనప్పుడు ఎవరు మద్దతు ఇస్తే మాత్రం ఏమి ప్రయోజనం?