తెలంగాణాలో తెదేపా, భాజపాలు దూరం అయ్యాయి కనుక ఆ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకోవడం ప్రారంభించాయి.
“రాష్ట్రంలో భాజపా తెరాసకి తోక పార్టీలాగ తయారయింది..ముఖ్యమంత్రి కెసిఆర్ ఏమి చేశారని కేంద్రప్రభుత్వం ఆయనకి నెంబర్:1 ర్యాంక్ ఇచ్చిందని” తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శిస్తే, “అసలు ఉనికే లేని పార్టీ నేతలు ఏవో మాట్లాడితే వాటిపై మేము స్పందించాలా?” అని కిషన్ రెడ్డి ఆ విమర్శల్ని త్రిప్పికొట్టారు.
ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కేంద్రంపై యుద్ధ ప్రకటన చేశారు. పంచాయితీ రాజ్ చాంబర్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న ఆయన కేంద్రప్రభుత్వం స్థానిక సంస్థలకి నిధులు కేటాయించకుండా చాలా అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకి రూ.15,000 కోట్లు, తెలంగాణాలో సంస్థలకి రూ.9,000 కోట్లు చెల్లించాల్సి ఉండగా వాటిని విడుదల చేయకుండా కేంద్రప్రభుత్వం త్రొక్కిపట్టిందని ఆరోపించారు. ఆ నిధుల కోసం జూలై 25న ఛలో డిల్లీ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
ఆయన స్థానిక సంస్థల నిధుల కోసం పోరాడుతున్నందున రెండు ప్రభుత్వాలు ఆయనకి వెనుక నుంచి అవసరమైన సహాయసహకారాలు అందించవచ్చు. అయితే తెదేపాకి చెందిన ఆయన మిత్రపక్షమైన భాజపా ప్రభుత్వంపై ఈవిధంగా యుద్ధ ప్రకటన చేయడం తెలంగాణాలో భాజపాతో తెగతెంపులకి సిద్దం అవుతున్నట్లు చేస్తున్న సూచనగానే భావించవచ్చు. భాజపా కూడా అందుకు సిద్దంగానే ఉంది కనుక నేడోరేపో ఆయనపై విమర్శలు గుప్పించవచ్చు. రెండు రాష్ట్రాలకి అవి అడిగిన దానికంటే చాలా ఎక్కువగానే నిధులు మంజూరు చేస్తున్నామని భాజపా వాదిస్తోంది కనుక ఆయన రాజకీయ దురుదేశ్యంతోనే ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించవచ్చు. ఈవిధంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం వలన చివరికి అ రెండు పార్టీలే తమ బలహీనతలని తమ రాజకీయ ప్రత్యర్దులకి తెలియజేసుకొన్నట్లు అవుతుందని గ్రహించడం లేదు.