ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే నిబంధనని యూపియే ప్రభుత్వం విభజన చట్టంలో చేర్చనందుకే ఇవ్వలేకపోతున్నామని చెప్పి కేంద్రప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తుండటం చూసి, కాంగ్రెస్ పార్టీ దానికి ఒక అగ్నిపరీక్ష పెట్టింది. ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీలుగా విభజన చట్టాన్ని సవరించాలని కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు గత పార్లమెంటు సమావేశాలలో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. ఒకవేళ కేంద్రప్రభుత్వానికి ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే కోరిక, చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందడానికి చొరవ చూపి ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నా కేంద్రప్రభుత్వానికి ఆసక్తి లేనందునే క్రిందటిసారి సమావేశాలలో దానిపై ఓటింగ్ జరుపకుండా తప్పించుకొంది. మళ్ళీ రేపు దానిపై ఓటింగ్ జరుగబోతోంది. ఈసారి దానిని ఆమోదింపజేసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ తన సభ్యులకి విప్ జారీ చేసి మిత్రపక్షాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. వైకాపా కూడా ఆ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయడానికి సిద్దంగానే ఉంది. తెదేపా, భాజపాలు మాత్రం తమ వైఖరిని బయటపెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు దీని గురించి మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి ఉంటే అప్పుడే ఈ అంశాన్ని విభజన చట్టంలో చేర్చి ఉండేది. కానీ అప్పుడు చేయవలసిన పని చేయకుండా ఇప్పుడు దానిపై ప్రైవేట్ బిల్లు పెట్టి హడావుడి చేస్తోంది. దానిపై మా పార్టీ తగిన విధంగా వ్యవహరిస్తుంది,” అని చెప్పారు.
అప్పుడు యూపియే ప్రభుత్వం ఈ అంశాన్ని విభజన చట్టంలో చేర్చకపోవడం తప్పే. కానీ ఇప్పుడు ఆ తప్పుని అది సరిదిద్దుకోవడానికి సిద్దపడుతుంటే భాజపా, తెదేపాలు దానికి ఎందుకు సహకరించడం లేదు? అనే ప్రశ్నకి ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే ప్రత్యేక హోదాకి ఆ రెండు పార్టీలే అడ్డుకొంటున్నాయని భావించవలసి వస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ, వైకాపాలతో సహా రాష్ట్రంలో అందరూ తెదేపా, భాజపాలానే వేలెత్తి చూపించడం తధ్యం.