రాహుల్ గాంధీ నిద్ర వ్యవహారంలో డ్యామేజీ కవరేజీకి కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతోంది. ఒకవైపు కాంగ్రెస్ ఎంపీలు దళితులపై దాడి అంశం గురించి చర్చకు పట్టుబట్టి లోక్ సభలో నానా గొడవ చేస్తున్న వేళ కాంగ్రెస్ యువరాజు కునుకు తీస్తు కనిపించడంతో జనాలు ఆయనను చూసి నవ్వుకున్నారు. ఇదేనా రాహుల్ కు ఉన్న శ్రద్ధ? అనే ప్రశ్న చాలా సహజంగానే వస్తుంది. ఈ విషయం గురించి ప్రతిపక్ష పార్టీల విమర్శల సంగతెలా ఉన్నా.. సామాన్యుల్లో రాహుల్ బాగా చులకన అయిపోయాడని కాంగ్రెస్ కే అర్థం అయ్యింది.
ఈ ఫ్రస్ట్రేషన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు డ్యామేజీ కవరేజ్ కు ఎదురుదాడి ఆయుధాన్ని ఎంచుకున్నారు. ఆ వీడియోలను చూపిన మీడియాను ఇప్పుడు వీరు నిందిస్తుండటం విశేషం. కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీని మీడియా లక్ష్యంగా చేసుకుందని, సోనియా, రాహుల్ లపై మీడియా కక్ష గట్టిందని అందుకే రాహుల్ నిద్ర అంశాన్ని హైలెట్ చేస్తోందని కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు వాదిస్తున్నారు! నిద్రిస్తున్న రాహుల్ ది తప్పు కాదు.. దాన్ని చూపుతున్న మీడియాది తప్పు అనేది వీరి వాదన.
ఇక మరో కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండేజ్ అయితే.. రాహుల్ దేశం కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్నాడని, అలా కష్టపడుతున్న వ్యక్తి అలా కొంచెం విశ్రాంతి తీసుకోవడంలో తప్పేముంది? అని ప్రశ్నించాడు. అయితే విశ్రాంతి తీసుకోవడానికి లోక్ సభేనా వేదిక? అనే ప్రశ్న వస్తుందని భయపడ్డాడోఏమో కానీ, రాహుల్ విశ్రాంతి తీసుకోలేదు, ఆయన దీర్ఘాలోచనలో ఉండటాన్ని చూసి నిద్రపోతున్నాడని అనుకున్నారు.. అంటూ మరో వాదనను వినిపించాడు ఈ నేత. మరి రాహుల్ నిద్ర వ్యవహారాన్ని కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ పాట్లకు ఈ మాటలకు మించిన సాక్ష్యం ఏముంది?