తెలంగాణా తెదేపా నేత ఉమా మాధవ్ రెడ్డి త్వరలో పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని ఆమె ఖండించడం లేదు కనుక త్వరలోనే పార్టీ మారడం ఖాయమనుకోవచ్చు. తెలంగాణాలో ఇప్పటికే తెదేపా దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. ఆ పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గొంతు మాత్రమే వినిపిస్తుంటుంది. ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, కొత్తకోట దయాకర్ రెడ్డి వంటి కొందరు నేతలున్నా వారెవరూ ఇదివరకులాగ చురుకుగా పార్టీని ముందుండి నడిపించడానికి ఉత్సాహం చూపడం లేదు. నల్గొండ జిల్లాలో ఉమా మాధవ్ రెడ్డి వర్గానికి మంచిపట్టు ఉన్నప్పటికీ ఆమె కూడా ఇదే కారణంతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. కనుక ఆమె పార్టీ వీడి వెళ్లిపోయినప్పటికీ తెదేపాకి కొత్తగా వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ ఆమె చేరికతో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరవచ్చు. ఎందుకంటే ఈ మధ్యనే అదే జిల్లాకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాసలోకి వెళ్ళిపోవడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడింది. కనుక కాంగ్రెస్ పార్టీ ఆమెని స్వాగతించవచ్చు. ఆమె సీనియర్ కాంగ్రెస్ నేత కె.జానారెడ్డితో టచ్చులో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చునని సమాచారం.