ఈసారి పార్లమెంటు సమావేశాలకు ప్రధాని మోడీ బృందం గొప్ప కసరత్తు చేసింది గాని ఆచరణలో పార్లమెంటు బయిటాలోపలా కూడా బిజెపి ఎదురు దెబ్బలతో ఉక్కిరి బిక్కిరవుతున్నది.
అత్యంత చిన్న ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో రాజకీయ దుస్సాహసం బిజెపికి మర్చిపోలేని పాఠం నేర్పింది. నబాం తుకి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పెమా కండూను ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేయడం వెళ్లిన వారంతా తిరిగి రావడం బిజెపి అవకాశవాదానికి సమ్మెటపోట్టయితే కాంగ్రెస్‌కు చాలా కాలం తర్వాత ఒకింత వూరట. ఇప్పుడు పెమాకండూ సభలో 46 మంది ఎంఎల్ఎల మద్దతుతో ఘనంగా మెజార్టి నిరూపించుకోవడంతో కథ ముగిసింది. కాని పార్లమెంటులో కాశ్మీర్ అరుణాచల్, ఉత్తరాఖండ్ పరిణామాలపై తీవ్ర దూమారం తప్పలేదు.
సామాజికంగా గోవధ సమస్య మైనార్టి వ్యతిరేకతకు ఉపయోగం అనుకుంటే దళితులపైకి మళ్లింది. ఈ దేశపు సాంసృతిక వైవిధ్యం ఫలితమది. ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రి సమీపంలోని గ్రామంలో గోమాంసం కలిగివున్నాడనే నెపంతో అఖ్లక్ ఖాన్ ప్రాణాలు తీసిన ఉదంతం దేశాన్ని కదిలించింది. కాని బిజెపి నేతలు పోలీసులపై ఒత్తిడి చేసి మరీ ఇప్పుడు ఆ కుటుంబంపై గోవధ కేసు పెట్టించారు(సమాజ్‌వాది ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎత్తివేయించవలసివుంది) ఇక వారు బిఎస్పి అధినేత మాయావతిపై చేసిన కువ్యాఖ్యలను రాజ్యసభ ఉపాద్యక్షుడే ఖండించవలసి వచ్చింది. రాష్ట్ర బిజెపి ఉపాద్యక్షుడిని తొలగించక తప్పలేదు.
ప్రధాని పాలించిన గుజరాత్‌లోని సౌరాష్ట్రలో దళితులపై అమానుష హింసాఘటన వీటన్నిటికి పరాకాష్ట. తరతరాల నుంచి అగ్రవర్ణాల ఆదేశాలతో మృతపశువుల కళేబరాలు వలిచి సేవలందిస్తున్న దళితులను గోవధ ఆరోపణతో బట్టలూడదీయించి కొట్టడం కోపాగ్ని రగిల్చింది. గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్తాలూకా మోటా సోమాదిపూరలో నలుగురు దళితులను అర్థనగంగా కట్టేసి హింసించిన ఉదంతం సోషల్‌మీడియాలో ప్రసారమై దేశాన్ని ఉడికించింది. ఇది భరించలేక పదిహేనుమంది దళిత యువత ఆత్మహత్యకు ప్రయత్నించగా ఒకరు చనిపోయారు. ఉద్రిక్త పరిస్థితులలో జరిగిన దాడిలో ఒక పోలీసు మరణించారు. మరెందరో గాయపడ్డారు. వారే పాలించే మరో మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో అంబేద్కర్ కార్యక్షేత్రంగా నిలిచినచారిత్రిక భవనాన్ని కూలగొట్టడం కూడా ఇలాటి విమర్శలకే దారితీసింది. అంబేద్కర్ 125వ జయంతి అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఈ విద్వంసంతో నిజస్వరూపం బయిటపెట్టుకుంది. ఇన్ని వైపుల నుంచి దళిత వర్గాల నిరసన పెల్లుబుకడం బిజెపి వూహించిన పరిణామం. దిద్దుకోలేని తప్పిదం కూడా. హెచ్‌సియు జెఎన్‌యు వివాదాల్లో బాధితులు దళితులైనా ఎలాగో నెట్టుకొచ్చిన బిజెపి ఇప్పుడు స్వయం కృతాల వల్లనే సుడిగుండంలో చిక్కింది. గుజరాత్ ప్రభావం అక్కడ ఎన్నికలపైనే గాక ఇతర చోట్ల కూడా ప్రభావం చూపిస్తుందనే ఆందోళన పెరుగుతున్నది.
గాంధీజీ హత్యలో ఆరెస్సెస్ హస్తం వుందంటూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యపై 499 కింద పరువు నష్టం దావాలోనూ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు తప్ప పెద్దగా సాధించింది లేదు.. ఆరెస్సెస్ మనుషులు హత్య చేశారంటే చెల్లుతుంది గాని సంస్థ మొత్తాన్ని అనరాదని మాత్రమే సుప్రీం కోర్టు మధ్యంతర వ్యాఖ్య చేసింది. గాడ్సేను దేశభక్తుడని కీర్తిస్తూ ఆయన జయంతి సభలు జరిపిన వైనం దేశం మోడీ గద్దెక్కాకే చూసింది. కనుక ఈ కేసు సాగితే బిజెపికి రాజకీయ లాభం కన్నా ఇరకాటమే పెరుగుతుంది. అంతెందుకు? హెచ్‌సియు జెఎన్‌యు వివాదాల్లో రెచ్చిపోయి మాట్లాడితే వీరనారిగా చిత్రించిన సృతి ఇరానీని శాఖ వారే మార్చేశారు. ఇప్పుడామె క్యాబినెట్ కమిటీలలో కూడా లేకుండా పోయారు.మరో వంక మరణించానని ప్రకటించిన తమిళ రచయిత పెరుమాల్ వరదన్ పునరుజ్జీవం కూడా లౌకిక మేధావులపై వారు సాగించిన దాడికి ప్రతిఘటన ఫలితమే..
ఆఖరుగా చెప్పుకోవలసిన ఎదురుదెబ్బ నిజంగానే బ్యాట్స్‌మన్ అయిన నవజ్యోతిసింగ్ సిద్దు కొట్టిందే! పంజాబ్‌లో రోసిపోయిన అకాలీ బిజెపి పాలననూ మైత్రిని నిరసిస్తూ ఆయన పార్టీ నుంచి నిష్క్రమించారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఓట్టు సాధించిన ఆప్‌లో చేరతారంటున్నారు. అది ఎలా వున్నా పంజాబ్‌లో అకాలీ బిజెపి కూటమి ఖాయమని మాత్రం తేలిపోయింది. పంజాబ్ ఫలితం తర్వాత గుజరాత్ యుపిలను కూడా ప్రభావితం చేస్తుంది.. మొత్తానికి ఇది మోడీ సర్కారుకు ఎదురుదెబ్బల పర్వంగా వుంది.