సాధారణంగా అనంతపురం ఫ్యాక్షన్ హత్యలు జరిగిన సందర్భాల్లో రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూ ఉంటాయి. గతంలో అయితే కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు వినిపించేవి, ఈ మధ్య కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్- టీడీపీల మధ్య ఈ ఆరోపణల పర్వం కొనసాగుతూ వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ హత్యలు చేయించిందనే ఆరోపణలు ఎదుర్కోవడం, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బాధిత స్థానంలో నిలవడం మామూలే. అయితే తాజాగా అనంతపురం టౌన్ లో జరిగిన జంట హత్య ల విషయంలో ఆరోపణలు, ఆరోపితులూ ఒకే పక్షానికి చెందిన వారు కావడం గమనార్హం.
పరిటాల అనుచరులు హత్యకు గురి కాగా, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరులు ఈహత్యలు చేశారనేది ఇప్పుడు బలంగా వినిపిస్తున్న ఆరోపణ. అయితే ఇది కొత్తగా వినిపిస్తున్న మాటేమీ కాదు, గత కొన్ని నెలలుగా ఈ అంశం చర్చలో ఉంది. ప్రభాకర్ చౌదరి వర్గం నుంచి తమ కు ప్రాణహాని ఉందని ఇప్పుడు హత్యకు గురైన పరిటాల అనుచరులు ఇది వరకే మీడియాకు ఎక్కారు. అయితే అప్పట్లో దాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు వారి హత్య జరిగే సరికి.. అనంత తెలుగుదేశం నేతల్లో విబేధాలు ఈ స్థాయిలో ఉన్నాయా? అని అనేక మంది ఆశ్చర్యపోతున్నారు!
గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకముందు నుంచే ప్రభాకర్ చౌదరి, పరిటాల కుటుంబాల మధ్య విబేధాలున్నాయి. గత ఎన్నికల్లో చౌదరి తొలిసారి ఎమ్మెల్యే కావడం , పార్టీ అధికారంలోకి వచ్చి సునీత మంత్రి కావడంతో వీరి మధ్య దూరం మరింత పెరిగింది. ప్రత్యేకించి అనంతపురం టౌన్ పై ఆధిపత్యానికి ఇరు వర్గాలూ పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అడపాదడపా గొడవలు చెలరేగుతున్నాయి. పరిటాల శ్రీరామ్ పోకడలను చౌదరి వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఈనేపథ్యంలో శ్రీరామ్ అనుచరులకు ఇది వరకే హెచ్చరికలు వెళ్లాయి.. ఇప్పుడు వారి హత్యలే జరిగాయి. ఈ హత్యలు చేసింది చౌదరి మనుషులే అని బాధితులు స్పష్టం చేస్తున్నారు. మరి అధికార పార్టీ వాళ్లే ఇలా నరక్కుచస్తుంటే.. శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ఇంకెవరిది?