మన దేశంలో రాజకీయ పార్టీలు సమస్యల పట్ల స్పందించే తీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఒక సమస్య ఏర్పడుతుంది. దాని వలన అతిసామాన్య ప్రజలు కొందరు బాధితులుగా ఉంటారు. వారికి చాలా అన్యాయం జరుగుతుంది. అప్పుడు మన రాజకీయ పార్టీలు వారి సమస్యపై చాలా తీవ్రంగా స్పందిస్తాయి. దానిపై పార్లమెంటు లోపలా బయటా భీకర యుద్ధం చేసుకొంటాయి. అంతే అక్కడితో ఆ కధ ముగిసిపోయినట్లే. సమస్య అక్కడే ఉంటుంది. భాదితులు అక్కడే ఉంటారు. వారికి న్యాయం జరుగదు కూడా. మన రాజకీయ పార్టీలకి వారి సమస్యలు తమ ప్రత్యర్దులని దెబ్బ తీయడానికి పనికివచ్చే రాజకీయాస్త్రాలుగా మాత్రమే ఉపయోగించుకోవాలని చూస్తాయి.
గుజరాత్ లో కొందరు దళిత యువకులకి జరిగిన అవమానం గురించి వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న బి.ఎస్.పి.కి, మోడీ ప్రభుత్వానికి మధ్య పార్లమెంటులో భీకర యుద్ధం జరిగింది. రేపు పార్లమెంటులో వేరే అంశాలపై చర్చలు, యుద్ధాలు జరుగవచ్చు కనుక గుజరాత్ లో దళితుల సమస్య అటకెక్కిపోయినట్లే భావించవచ్చు. దానిపై పార్లమెంటులో కూడా చర్చ జరిగి, ప్రతిపక్షాలు చాలా గొడవ చేశాయి కనుక గుజారత్ ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేప్పట్టవచ్చు. కానీ అంత మాత్రాన్న దళితులు ఎదుర్కొంటున్న ఆ పరిస్థితులు మారిపోవని అందరికీ తెలుసు. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరొందిన గుజరాత్ లోనే అటువంటి దుస్థితి నెలకొని ఉంటే, బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఝార్ఖండ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలలో దళితులు, మైనార్టీల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. సామాజిక పరివర్తన వస్తే తప్ప వారి సమస్యలు తీరవు. కానీ మన రాజకీయ పార్టీలకి దళితులు, మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూడటం అలవాటు కనుక వారి సమస్యలని కూడా రాజకీయ అంశాలుగా మాత్రమే చూడగలవు. అంతుమించి అవి ఆలోచించలేవు. వాటికి ఆ ఆసక్తి, ఓపిక, శ్రద్ద, సమయం ఏవీ లేవు ఉండవు కూడా.