కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్లుగా ఇంతవరకు ఉమ్మడి హైకోర్టు విభజన జరగకపోవడానికి కూడా అన్నే కారణాలు కనిపిస్తున్నాయి. నిన్న మళ్ళీ ఈ అంశంపై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. విశేషం ఏమిటంటే, ఈసారి కేంద్రప్రభుత్వం, తెలంగాణా ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు అందుకు హైకోర్టునే తప్పు పట్టారు.
విభజన చట్టంలోని సెక్షన్ 31(2)కి కారణంగా హైదరాబాద్ లో ఏపికి కానీ తెలంగాణాకి గానీ వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయడానికి వీలులేదని, ఆవిధంగా చేయాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని గత ఏడాది మే1న హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పు కారణంగానే తాము హైదరాబాద్ లో ఏదో ఒక రాష్ట్రానికి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయలేకపోయామని కేంద్రం తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎంకే నటరాజ్ వాదించారు. అది తమ చేతులని కట్టివేసిందని వాదించారు.
హైదరాబాద్ లో వేరేగా హైకోర్టు ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక అధికారాలకి అవరోధం కల్పించేదిగా ఆ తీర్పు ఉందని తెలంగాణ ఏజీ కె. రామక్రిష్ణారెడ్డి వాదించారు. రెండు తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్ 10 ఏళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఏపి లేదా తెలంగాణాకి వేరేగా హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదని ప్రశ్నించారు. గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవరించవలసినట్లయితే ఈ సమస్య పరిష్కరింపబడే అవకాశం ఉందని వాదించారు.
కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆంధ్రప్రదేశ్ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ గట్టిగా సమర్ధించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబందనలనే ఖచ్చితంగా అమలుచేయాలని హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది తప్ప అది కొత్తగా ఏమీ చెప్పలేదని వాదించారు.
అందరి వాదనలు విన్న తరువాత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసాలే కేంద్రప్రభుత్వం తరపున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎంకే నటరాజ్ ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగితే ఆయన వాటికి సమాధానాలు చెప్పలేకపోయారు. హైకోర్టు ఏమని అడిగిందంటే:
1. ఏపిలో శాశ్విత హైకోర్టు భవనసముదాయాల నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేసిందా? లేదా? దాని కోసం తగినన్ని నిధులు విడుదల చేయాలని 15 నెలల క్రితం మేము ఆదేశిస్తే ఇంతవరకు మీరు ఎందుకు మా ఆదేశాలని అమలుచేయలేదు? అది కోర్టు ధిక్కారమని మీకు తెలియదా? మేము చర్యలు తీసుకొంటే ఏమవుతుందో మీకు తెలుసు కదా?
2. ఏపి ప్రభుత్వం మూడు నెలల వ్యవధిలోనే తాత్కాలిక సచివాలయం నిర్మించుకొన్నట్లుగా, హైకోర్టు భవనాలని కూడా నిర్మించుకోదలిస్తే కేంద్రం అందుకు నిధులు విడుదల చేస్తుందా లేదా?
3. గత ఏడాది ఇచ్చిన తీర్పుని మేము సవరణ చేస్తే, హైదరాబాద్ లోనే ఏపికి లేదా తెలంగాణాకి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయడానికి మీరు సహకరిస్తారా లేదా?
దీనిపై ఏపి, తెలంగాణా, కేంద్రప్రభుత్వం మూడూ క్లుప్తంగా తమ వివరణలు ఇవ్వాలని ఆదేశిస్తూ హైకోర్టు తన తీర్పుని రిజర్వ్ చేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు కారణంగానే ఇంతవరకు విభజన చేయలేకపోయామని కేంద్రప్రభుత్వం తప్పించుకోవాలని చూసినప్పటికీ, హైకోర్టు అడిగిన ప్రశ్నలు కేంద్రప్రభుత్వం వైఖరిని ఎండగట్టేవిగా ఉన్నాయి. హైకోర్టు విభజనకి ఏపి ప్రభుత్వం అడ్డుపడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతుంటారు. కానీ హైకోర్టులో ఏపి ప్రభుత్వ వాదన అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వాలు, వాటిని నడుపుతున్న రాజకీయ పార్టీలు ఈ సమస్యని పరిష్కరించలేనప్పుడు హైకోర్టే స్వయంగా దీనిని పరిష్కరించడం మంచిది.