తెదేపా ఎంపి సిఎం రమేష్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ వారి అభ్యంతరాలని ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించేసి ఏపికి ఈ దుస్థితి కల్పించింది. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితిని చూసి మొసలి కన్నీళ్లు కార్చుతూ పార్లమెంటులో ప్రత్యేక హోదా కోరుతూ ప్రైవేట్ బిల్లు పెట్టి మరో కొత్త డ్రామా ఆడుతోంది,” అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసమైతేనేమి, తెలంగాణా ఉద్యమాల కారణం వల్లనయితేనేమి రాష్ట్ర విభజన చేసింది. రాష్ట్ర విభజన వలన ఏపి, తెలంగాణాలే ప్రభావితం అవుతాయి కనుక యూపియే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’ లో ఆ రెండు ప్రాంతాల ప్రతినిధులని సభ్యులుగా చేర్చుకొని ఉండి ఉంటే రాష్ట్ర విభజన మరికొంత ఆలశ్యం అయ్యేదేమో కానీ నేడు ఇటువంటి సమస్యలు వచ్చేవే కావు. కానీ ఆ ప్రక్రియలో ఆంధ్రా, తెలంగాణా నేతలని అసలు జోక్యం చేసుకోనీయకుండా యూపియే ప్రభుత్వమే ఏకపక్షంగా రాష్ట్ర విభజన ప్రక్రియని పూర్తిచేసి చేతులు దులుపుకొంది. కనుక విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకపోవడానికి దానినే తప్పు పట్టవలసి ఉంటుంది.
కాంగ్రెస్ అధిష్టానానికి నిజంగానే ఏపి పట్ల ప్రేమాభిమానాలు, కృతజ్ఞత ఉన్నట్లయితే అప్పుడే ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చి ఉండేది. ఏపి కాంగ్రెస్ నేతలనే చాలా చులకనగా చూసిన కాంగ్రెస్ అధిష్టానం ఇక ప్రజలని గౌరవిస్తుందనుకోలేము. అందుకే అది లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సుమారు రెండున్నర నెలల పాటు ఆందోళన వ్యక్తం చేసినా వారి అభిప్రాయాలకి, అభ్యంతరాలకి పూచిక పుల్లంత విలువ కూడా ఈయకుండా పార్లమెంటు కిటికీలు తలుపులు మూసేసి రాష్ట్ర విభజన చేసేసింది.
అప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చడం తన చేతిలో పనే అయినప్పటికీ ఆ పని చేయలేదు. గతంలో ఉత్తరాఖండ్ కి ప్రత్యేక హోదా విషయంలో వాజపేయి ప్రభుత్వం అనుసరించిన ఫార్ములానే తాము అనుసరించామని, అప్పుడు ఆ ప్రభుత్వం చేర్చలేదు కనుక తాము చేర్చలేదని జైరాం రమేష్ నిసిగ్గుగా తమ తప్పుని సమర్ధించుకొన్నారు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చలేదని అయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.
అప్పుడు అవసరం లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు దానిని చట్టంలో చేర్చాలని కోరుతూ కెవిపి రామచంద్ర రావు ద్వారా ప్రైవేట్ బిల్లు పెట్టించడం దేనికంటే మోడీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి, రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టడానికేనని చెప్పక తప్పదు. అందుకే ఈవిషయంలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదు.