ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎంతగా విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ వాటినీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తిరిగి ‘అభివృద్ధికి అడ్డుపడుతున్నాయంటూ’ వాటిపై ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న తీసుకొన్న రెండు నిర్ణయాలు కూడా అటువంటివేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1.నేలపాడులో భూసేకరణ 2. రాజకీయ పార్టీలకి రాజధానిలో భూములు కేటాయించడం.
మొదటి నిర్ణయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా వ్యతిరేకతని ఎదుర్కొంది. ఇకపై కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక రెండవ నిర్ణయం కూడా చాలా వివాదాస్పదంగానే ఉంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకొని వాటిని కార్పోరేట్ కంపెనీలకి అప్పగించే ప్రయత్నాలు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు అటువటిదే మరో నిర్ణయం తీసుకొంది.
రాజకీయ పార్టీలకి శాసనసభలో వాటి సభ్యుల సంఖ్య ఆధారంగా అమరావతిలో కానీ, జిల్లా కేంద్రంలోగానీ భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. భూముల కేటాయింపుకి మూడు కేటగిరీలని ఏర్పాటు చేసింది. మొదటి కేటగిరిలో రాష్ట్ర శాసనసభలో 50శాతం కంటే ఎక్కువ మంది సభ్యులున్న జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలకి అమరావతిలో 4ఎకరాల స్థలం కేటాయించబడుతుంది. అంటే తెదేపా ఒక్కదానికే ఆ అవకాశం ఉందన్నమాట. రెండవ కేటగిరీలో శాసనసభలో 25-50 శాతం సభ్యులున్నట్లయితే ఆ పార్టీలకి అర ఎకరం భూమి కేటాయించబడుతుంది. అంటే వైకాపాకి అరా ఎకరం కేటాయించబడుతుందన్నమాట. మూడో కేటగిరీలో శాసనసభలో 25 కంటే తక్కువ శాతం లేదా కనీసం ఒక్క సభ్యడు ఉన్న పార్టీలకి 1000చదరపు గజాల స్థలం కేటాయించబడుతుంది. భాజపాకి ఆ అవకాశం ఉందన్నమాట. శాసనసభలో సభ్యత్వం లేని కాంగ్రెస్ పార్టీకి భూమి కేటాయించబడదు. తెదేపా తనకి అనుకూలంగానే ఈ నియమం ఏర్పాటు చేసుకొందని అర్ధమవుతూనే ఉంది.
రాజధాని నిర్మాణం కోసమని చెప్పి రైతుల దగ్గర తీసుకొన్న భూములని కోట్లకి పడగలు ఎత్తిన రాజకీయ పార్టీలకి అప్పనంగా పంచి పెట్టవలసిన అవసరం ఉందా? ఒకపక్క నేలపాడు రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించి భూములు స్వాధీనం చేసుకోవడానికి సిద్దం అవుతూ, మరోపక్క రాజకీయ పార్టీలకి భూమిని పంచిపెడితే రైతులు, ప్రజలు ఏమనుకొంటారో ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండేది.