ఇవ్వాళ్ళ మధ్యాహ్నం రెండున్నర గంటల తరువాత కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగబోతోంది. కాంగ్రెస్, వైకాపాలు రెండూ ఆ బిల్లుకి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ తన సభ్యులకి విప్ కూడా జారీ చేసింది. తెదేపా, భాజపాలు రెండూ ఆ బిల్లు ఓటింగ్ కి వచ్చినప్పుడు ఎటువంటి వైఖరి అవలంభించబోతున్నాయో ఇంతవరకు బయటపెట్టలేదు. తాజా సమాచారం ప్రకారం భాజపా తన సభ్యులకి విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ బిల్లుపై సభలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా అందరూ హాజరవ్వాలని విప్ ద్వారా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ బిల్లుని వ్యతిరేకిస్తే ఏపిలో భాజపా పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉంది కనుక దానిని వ్యతిరేకించక పోవచ్చు. అలాగని సమర్ధిస్తే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం కూడా సిద్దమనే సంకేతం ఇచ్చినట్లు అవుతుంది. కనుక సభకి అందరూ హాజరయినప్పటికీ, ఆ బిల్లుపై మూజువాణి పద్దతిలో ఓటింగ్ నిర్వహించి మౌనంగా ఊరుకొంటే, కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా తప్పించుకోవచ్చని భాజపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి సమస్య తెదేపాకి లేదు కనుక ఆ బిల్లుకి అనుకూలంగా ఓటు వేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. తెదేపా పరిస్థితిని కేంద్రప్రభుత్వం కూడా అర్ధం చేసుకొంటుంది కనుక అదీ అభ్యంతరం చెప్పదు. చెపితే దానికే నష్టం.
ఒకవేళ ఈరోజు బిల్లు ఆమోదం పొందినట్లయితే, ఆ తరువాత మళ్ళీ దాని కోసం లోక్ సభలో కూడా మరో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టవలసి ఉంటుంది. లోక్ సభ స్పీకర్ దానిని చర్చకి స్వీకరించితే దానిపై సభలో చర్చ జరుగుతుంది. లోక్ సభలో ఎన్డీయే కూటమికే బలమ ఉంది కనుక అక్కడ ఆ బిల్లుని ఎటు కావాలంటే అటు తిప్పుకొనే వెసులుబాటు దానికి ఉంటుంది. కావాలంటే ఏదో ఒక సాకుతో పక్కన పెట్టేయవచ్చు. కనుక రాజ్యసభలో బిల్లు నెగ్గినా దాని వలన రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు కానీ దానిని ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ, దానికి మద్దతు ఇచ్చి గెలిపించినందుకు వైకాపా ప్రజల ముందుకు వచ్చి గట్టిగా భుజాలు చరుచుకోగలవు అంతే!
అంతిమంగా తేలేదేమిటంటే, పార్లమెంటు సాక్షిగా ఈ నాలుగు రాజకీయ పార్టీలు కలిసి ఆడబోతున్న ఈ డ్రామా వలన ప్రత్యేక హోదా రాదు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకొంటేనే వస్తుంది. కానీ ఆయన తలుచుకోరు. కనుక ఈరోజు జరుగబోయే డ్రామా రాష్ట్రంలో నాలుగు రాజకీయ పార్టీలు ఒకదానిని మరొకటి రాజకీయంగా దెబ్బ తీసుకొనేందుకు మాత్రమే పనికి వస్తుంది. ఈ డ్రామా ముగిసిన తరువాత రేపటి నుంచి ఆ నాలుగు పార్టీల మధ్య జరుగబోయే యుద్ధమే అందుకు నిదర్శనంగా నిలుస్తుంది.