రాజకీయ వలసలు అనివార్యం అని గుర్తించినట్టుగా ఉన్నాడు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు అనేక మంది కాంగ్రెస్ మాజీ, తెలుగుదేశం అసంతృప్తులు వచ్చి చేరతామని కోరినా.. కొందరి విషయంలో జగన్ ఆసక్తి చూపలేదు. అవసరం అవుతారు అనుకున్న వారిని చేర్చుకుని మిగతా వారికి పలకలేదు జగన్ మోహన్ రెడ్డి. మరి అదంతా నాటి లెక్క. ఎన్నికల్లో ఓటమి, ఇప్పుడు అనేక మంది నేతలు తన పార్టీని వీడిపోవడం వంటి కారణాలతో జగన్ తన పంథాను మార్చాడు. ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ మాజీలను చేర్చుకొంటూ ముందుకు పోతున్నాడు!
ఉండవల్లి వంటి వాళ్లు జగన్ పార్టీలోకి చేరడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన మాత్రమే గాక.. ఇంకా అనేక మంది కాంగ్రెస్ మాజీలు త్వరలోనే జగన్ పార్టీ బాట పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వీరిని మాత్రమే కాదు.. జగన్ తెలుగుదేశం వైపు కూడా చూస్తున్నట్టు సమాచారం. ప్రత్యేకించి మొన్నటి ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి చేరి, ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలై ఇప్పుడు తెలుగుదేశంలో అసంతృప్తిగా ఉన్న వారిని గుర్తించే పనిలో ఉందట జగన్ గ్యాంగ్.
ఎన్నికల ముందే తెలుగుదేశం చేరారు కాబట్టి.. వారికి టీడీపీతో అంతగా అనుబంధం ఉండదు. పార్టీ గెలిచినా, ఓడిపోయిన వారికి తెలుగుదేశంలో ఎలాంటి ప్రాధాన్యతా దక్కడం లేదు. దశాబ్దాలుగా తెలుగుదేశంలో ఉన్న వారు.. వీరిని అణగదొక్కుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్నారనే పేరే కానీ వీరి మాట జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని తనవైపుకు తిప్పుకోవడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఇలాంటి నేతల మీద జగన్ దృష్టి పెట్టినట్టు సమాచారం.