‘కబాలి’.. కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్న చిత్రం . ఇదివరకు ఎన్నడూ లేని విధంగా సూపర్ స్టార్ రజనికాంత్ ‘కబాలి’ సినిమాపై అంచానాలు ఆకాశాన్నంటేశాయి. విడుదల తేదీ ప్రకటించిన నాటి నుండి మరింతగా ఈ సినిమా కి హైప్ వచ్చింది. ‘కబాలి’ఫీవర్ తో ఎక్కడ చూసిన హాట్ హాట్ గా చర్చ కొనసాగుతోంది. అభిమానుల్ని ఊపేస్తోంది. అమెరికాలో ‘కబాలి’ సినిమా ప్రివ్యూ గురువారం ఉదయమే రిలీజ్ చేశారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రిపోర్ట్ చూస్తే మిశ్రమమ్ గా ఉంది. డిఫరెంట్ పబ్లిసిటీ తో అందరిని ఆ కట్టుకున్నఈ చిత్రం తెలుగు లో కూడా ఈ రోజునే విడుదల అయ్యింది. వి.క్రియేషన్స్ పతాకం పై పా. రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మించిన ఈ చిత్రం లో రాధికా ఆప్టే, ధన్సిక, విన్స్టన్ చవ్, ముఖ్య పాత్ర దారులు, కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ వర్మ, దేవి శ్రీదేవి సతీష్, ఏ కె .నటరాజ్, డి.పరాధమన్ లు షణ్ముఖ ఫిల్మ్స్ సంస్థ ద్వారా తెలుగు వెర్షన్ లో విడుదల చేశారు. మరి ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఉందా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..
కథ :
చిత్రం పూర్తిగా మలేషియా నేపథ్యంగా కథ నడుస్తుంది. గతం లోకి వెళితే మలేసియా లో కబాలీశ్వర (రజని కాంత్) కుందనవల్లి (రాధికా ఆప్టే) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు కలిసి పని చేసుకుంటూ సామాన్య జీవితం గడుపుతుంటారు. అక్కడి అరాచకాలు ఎదుర్కొంటున్న ఇండియన్స్ తమను ఆదుకునే వాడికోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి లో యాజమాన్యానికి ఎదురు నిలిచి నాయకుడిగా ఎదుగుతాడు. అప్పటికే ఇండియన్స్ తరపున అండగా నిలిచిన సీనియర్ నాయకుడు సీతారామ రాజు(నాజర్) తో కలిసి, మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే టోనీ లీ (విన్స్టన్ చావ్) అతని అనుచరుడు వీర శంకర్ లను ఎదుర్కొంటాడు. తమ వ్యాపారానికి అడ్డు తగులుతున్నరని ముందుగా సీతరామ రాజు ని చంపేస్తారు. ఆ తరువాత కబాలి ఆ గ్యాంగ్ కి నాయకుడు అవుతాడు. తండ్రి తరువాత కొడుకే నాయకుడు కదా ఎవడో కబాలి నాయకుడు ఏంటి? అనే ఈ పరిణామం, సీతారామ రాజు కొడుకుకి నచ్చదు. దానికి తోడు తనకు ఓ పార్టీ లో జరిగిన అవమానం కి ప్రతీకారం గా మంచి తనం తో ప్రేమపూర్వకంగా కబాలి, గర్భవతి గా వున్న కుందనవల్లి ని అమ్మ వారి జాతరకు ఆహ్వానిస్తాడు. అక్కడే శత్రువుల తో చేతులు కలిపి నమ్మక ద్రోహం చేస్తాడు. అక్కడ జరిగిన దాడి లో భార్యను పొడిచేస్తారు. రకరకాల కేసులు పెట్టి కబాలి ని జైల్ పాలు చేస్తారు. జాతి వివక్షను ఎదిరించే నేపధ్యం లో, 25 ఏళ్ళ పాటు జైలు జీవితం అనుభవించిన సూపర్ స్టార్ నెల్సన్ మండేలాలాగా అక్కడికి తిరిగి వస్తాడు. వయసు మళ్ళిన కబాలి జైల్ నుండి వచ్చిన తరువాత ఏం చేసాడన్నది మిగతా కథ.
నటి నటుల పెర్ఫార్మన్స్:
సూపర్ స్టార్ రజనికాంత్ నటన ఇక్కడ అప్రస్తుతం, అభిమానులకు ఈ సినిమా తప్పకుండా మెస్మరైజ్ చేస్తుంది. స్లో మోషన్ వాక్స్, స్టైలిష్ పోజులు, క్రిస్పీ డైలాగులు సినిమా అంతటా ఉండటం ఆయన
అభిమానిని సంతోషపెడుతుంది. రజనీ చాలా పొందిక తన మ్యానరిజమ్స్ ప్రదర్శించిన ప్రతిసారి థియేటర్ హర్షధ్వానాల్లో ముంచడం కొత్తేమి కాదు. కానీ ఈ చిత్రం లో అలా జరుగ లేదు. ఓ వయస్సు మీద పడిన గ్యాంగ్‍స్టర్‌గా, కబాలి అనే పాత్రలో రజనీ స్టైల్, నటన అన్నీ టాప్ క్లాస్ అనేలా ఉన్నాయి.ఈ సినిమాలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయి. ఇందులో రజనీ యువకుడిగా కనిపించి.. ఆ హేర్ స్టయిల్ డ్రెస్సింగ్ చూస్తుంటే, ఒకప్పటి రజనీని గుర్తుకుతెస్తాడు. రజనీకి ఉన్న లార్జర్ దన్ లైఫ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని దర్శకుడు పా రంజిత్ సినిమాను డీల్ చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాల్లో రజనీ చేసిన అద్భుతాలే మళ్లీ ఇందులో కనిపిస్తాయి. భార్య పాత్రలో రాధికా ఆప్టే అద్భుతంగా నటించింది. కూతురు పాత్రలో డైనమిక్ లేడీ గా, ధన్సిక అందరిని ఆకట్టుకుంది. విల్లన్ పాత్రల్లో మలేసియాన్ నటుడు విన్స్టన్ చావ్, కలై రసన్ మిగతా నటులు ఓ కె అనిపించారు.
సాంకేతిక వర్గం :
ముందుగా దర్శకుడు పా రంజిత్, రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్ ఉన్నా కూడా కథను నేచురల్ గా చెప్పాలన్న ప్రయత్నం చేశాడు. అయితే ఒక బలమైన కథాంశాన్ని అన్నివర్గాల ప్రేక్షకులకూ కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో మాత్రం దర్శక, రచయితగా రంజిత్ చాలా చోట్ల విఫలమయ్యాడు. రజనీ స్థాయి ఇమేజ్‌ని అందుకోవడంలో దర్శకుడి ఆలోచన విధానం తేలిపోయింది. ఇవన్నీ అలా ఉంచితే కథనం పరంగా రంజిత్ చేసిన మ్యాజిక్‌ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. సౌండ్, లైటింగ్ సిటీ బ్యూటీ నెస్ వీటన్నింటినీ కథ ఎమోషన్‌లో భాగంగా సరిగ్గా వాడడంలో రంజిత్ కొన్ని చోట్ల ఆకట్టుకున్నాడు. అయితే ఈ మేకింగ్ సినిమాకు కమర్షియల్‌గా ఏ మాత్రం ఉపయోగపడలేదు. సంతోష్ నారాయణ్ అందించిన ఆడియోలో ‘నిప్పు రా’ ఇట్టే ఎక్కేస్తుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మేజర్ హైలైట్‌గా చెప్పుకోవాలి. జి.మురళి సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన సినిమాటోగ్రఫీ స్టైల్‌తో దర్శకుడి ఆలోచనకు, కథ మూడ్‌కు మురళి ఓ సరికొత్త రూపాన్నిచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. కళైపులి థాను ప్రొడక్షన్ కు ఎవరు పేరు పెట్టలేరు ఎందుకంటే ఇది రజని చిత్రం.
విశ్లేషణ :
మామూలు సినీ వీక్షకుడికి మాత్రం ఈ చిత్రం లో సీన్లు అసహజంగా, బోర్ కొట్టించేవిగా అనిపించవచ్చు. వయస్సు మీద పడిన రజనీ ఫ్లాష్ బ్యాక్ సీన్లలో 30 ఏళ్ల యువకుడిగా కనిపించడం కూడా కొద్దిగా ఎబ్బెట్టుగా తోచవచ్చు. మొత్తానికి సినిమాపరంగా చూస్తే కొంచెం నిడివి పెరిగినట్టు అనిపించినా రజనీ మళ్లీ తనదైన నటన చూపించాడు. ‘కబాలి’.. రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్‌ని పెట్టుకొని ఓ వాస్తవిక కథతో సినిమా తీయాలన్న దర్శకుడు పా రంజిత్ ఆలోచన నుంచి పుట్టిన సినిమా. ఈ ఆలోచన మెచ్చుకోదగినదే అయినా, అలాంటి వాస్తవిక కథలోనూ, రజనీ ఇమేజ్‌కు సరిపడేలా సన్నివేశాలు పెట్టుకునే అవకాశం ఉంటుందని తెలిసీ, వాటి జోలికి పోకపోవడం ఈ సినిమా విషయంలో జరిగిన తప్పిదంగా భావించొచ్చు. రజనీ సినిమాలో ఏయే అంశాలు ఉంటాయనుకొని ప్రేక్షకులు ఆశించి వెళతారో అవన్నీ ఈ సినిమాలో అనుకున్న స్థాయిలో లేవు. రజనీని పూర్తిగా కొత్తగా, ఓ రియలిస్టిక్ సినిమాలో చూడాలని కోరుకునే వారికి ఈ సినిమా నచ్చొచ్చు. అయితే రజనీ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే వెళితే మాత్రం నిరాశ తప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘కబాలి’, వాస్తవికతకు కాస్త దగ్గరగా, రజనీ స్టయిల్ సినిమా కి దూరం గా ఉంది. ఏమైనా సరే ఒక సారి సినిమా చూస్తే పోలా…రజని చిత్రం కదా మరి.
తెలుగు360.కామ్ రేటింగ్ 2.5/5
బ్యానర్ :వి .క్రియేషన్స్, మరియు షణ్ముఖ ఫిల్మ్స్,
నటి నటులు : ‘సూపర్ స్టార్’ రజని కాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, విన్స్టన్ చవ్,దినేష్ రవి,కిషోర్,కలై రసన్,జాన్ విజయ్,రిత్విక, రోషామ్ నోడ్ తది తరులు…
కెమెరా : జి. మురళి,
పాటలు :సాహితి, అనంత్ శ్రీ రామ్, రామ జోగయ్య శాస్ట్రీ, వనమాలి,
ఎడిటింగ్ : కె .యల్ .ప్రవీణ్,
సంగీతం : సంతోష్ నారాయణ్
నిర్మాత :కళైపులి థాను,
తెలుగు వెర్షన్ కొనుగోలుదారులు : కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ వర్మ, దేవి శ్రీదేవి సతీష్, ఏ కె .నటరాజ్, డి.పరాధమన్,
కథ, కధనం, దర్శకత్వం : పా.రంజిత్,
విడుదల తేదీ : 22.07.2016
Click here for English Review