తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులలో చాలా అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంతో, వాటిలో నిజానిజాలు, సాధకబాధకాలు తెలుసుకొనేందుకు తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకి బయలు దేరారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవ్వాళ్ళ ఆయన జిల్లాలో పశ్చిమ మండలైన కొడంగల్, మక్తల్, నారాయణ్ పేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ప్రజలు, రైతులు, ప్రజా సంఘాలు నేతలని కలుసుకొంటూ ఈ ప్రాజెక్టు గురించి వారి అభిప్రాయలు, అభ్యంతఃరాలు, సూచనలు తెలుసుకొంటూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇక్కడికి సుమారు 300కిమీ దూరంలో ఉండే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎగువనున్న మా మండలాలికి నీళ్ళు పారించడం కంటే ఎగువన, సమీపంలో ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచైతేనే మాకు నీళ్ళు అందుతాయని రైతులు చెపుతున్నారు. ఇక్కడ చెరువులు గత 15-20సం.లుగా ఎండిపోయి ఉన్నాయని, వాటిని ఇప్పటికిప్పుడు నింపడం సాధ్యం కాదు కనుక జూరాల నుంచే నీళ్ళు అందివ్వాలని ప్రజలు కోరుకొంటున్నారు. కనుక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి కొన్ని మార్పులు చేర్పులు చేయడం అవసరమని కూడా చాలా మంది సూచిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో మేము మరిన్ని ప్రదేశాలు పర్యటించి, అక్కడి ప్రజలని కలిసి ఈ ప్రాజెక్టుకి సంబంధించి అన్ని వివరాలు సేకరించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వివరాలు సమర్పిస్తాము. ప్రభుత్వ స్పందన బట్టి మా కార్యాచరణ నిర్ణయించుకొంటాము,” అని చెప్పారు.
ఇంతవరకు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అవినీతి ఆరోపణలని తెరాస ప్రభుత్వం గట్టిగానే త్రిప్పికొడుతోంది. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న సాంకేతి అంశాలకి మాత్రం ఇంకా సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఇటువంటి సమయంలో తెలంగాణా ప్రజలలో చాలా గౌరవం కలిగిన ప్రొఫెసర్ కోదండరాం స్వయంగా ప్రాజెక్టులపై అధ్యయనానికి బయలుదేరి, వాటిలో లోపాలని, అవినీతిని ఎత్తి చూపడం మొదలుపెట్టడం వలన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతిపక్ష పార్టీలయితే రాజకీయ దురుదేశ్యంతోనే తెరాస ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయని ప్రజలకి సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఏ రాజకీయాలకి అతీతంగా మెలిగే ప్రొఫెసర్ కోదండరాం కూడా ఆరోపణలు చేస్తే ప్రభుత్వం వాటిని అంత తేలికగా కొట్టిపారేయలేదు. అలాగని ఆయనపై ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడి చేసినట్లు దాడిచేసి నూరు మూయించలేదు కూడా. కనుక ప్రొఫెసర్ కోదండరాం పర్యటన తెరాస ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.