ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్రప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పింది. ఇవ్వాళ్ళ మళ్ళీ మరోసారి దానిపై తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదని నిరూపించి చూపింది. ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్ర రావు పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. దానిపై ఓటింగ్ జరుపవలసి వస్తుందని పార్లమెంటుని రెండు రోజుల ముందుగానే వాయిదా వేసి కేంద్రప్రభుత్వం తప్పించుకొంది. మళ్ళీ ఈరోజు దానిపై ఓటింగ్ జరుపవలసిన సమయంలో, భాజపా సభ్యులు రాజ్యసభలో గందరగోళం సృష్టించి సభాకార్యక్రమాలని అడ్డుకోవడంతో, బిల్లుపై ఓటింగ్ మొదలుపెట్టక మునుపే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. ఆమాద్మీ పార్టీ ఎంపి మాన్ సింగ్ పార్లమెంటు భద్రతాలోపాలని ఎత్తిచూపేందుకు లోక్ సభ లోపల నిన్న వీడియో షూటింగ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ రాజ్యసభలో భాజపా సభ్యులు ఆందోళన చేశారు. అది హోదా బిల్లుని అడ్డుకోవడానికేనని అర్ధమవుతూనే ఉంది.
బిల్లుపై ఓటింగ్ జరిగి, నెగ్గితే దాని వలన కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది కనుక, అసలు దానిపై ఓటింగ్ మొదలవక మునుపే ఏదో కుంటిసాకుతో సభని స్తంభింపజేసి, ఓటింగ్ జరుగకుండా భాజపా సభ్యులే అడ్డుకొన్నారు. ఈ బిల్లుపై మళ్ళీ రెండు వారాల తరువాత ఓటింగ్ కి వచ్చే అవకాశం ఉంది. కానీ మళ్ళీ అప్పుడు కూడా కేంద్రప్రభుత్వం ఇదేవిధంగా తప్పించుకొనే ప్రయత్నం చేయడం తధ్యం.
అధికార పార్టీ సభ్యులే సభా కార్యక్రమాలని అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ ఎంపి ఆనంద శర్మ తప్పు పట్టారు. ప్రత్యేక హోదాపై మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కనుకనే ఈవిధంగా తప్పించుకొంటోందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కనుకనే భాజపా సభ్యులతో బాటు కాంగ్రెస్ సభ్యులు కూడా సభలో ఆందోళన చేసి బిల్లుపై ఓటింగ్ జరుగకుండా అడ్డుకోన్నారని కేంద్రమంత్రి సుజనా చౌదరి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని ఆ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమని కోరారని, తాము కూడా అందుకు సిద్దపడివస్తే కాంగ్రెస్ సభ్యుల కారణంగా బిల్లుపై ఓటింగ్ జరుగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా విజయవాడ ఎంపి కేశినేని నాని కూడా కాంగ్రెస్ పార్టీనే తప్పుపట్టారు. బిజినెస్ అడ్వైజరీ సమావేశం జరిగినప్పుడు రెండవ స్థానంలో ఉన్న ఈ బిల్లుని 14వ స్థానంలోకి మార్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పనప్పుడే దాని నిజాయితీపై తనకి అనుమానం కలిగిందని తెదేపా ఎంపి సి.ఎం.రమేష్ అన్నారు.
ఇంకా దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించవలసి ఉంది. అది భాజపా, తెదేపాలని తప్పు పడుతో విమర్శలు గుప్పించావచ్చు. అంతిమంగా తేలిందేమిటంటే, నాలుగు ప్రధాన పార్టీలు ఒకదానిపై మరొకటి బురద జల్లుకొనేందుకు మాత్రమే ఈ బిల్లు ఉపయోగపడిందని!