రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం పెట్టిన బిల్లుపై ఎటువంటి చర్చ, ఓటింగ్ జరుగాకుండానే సభ సోమవారానికి వాయిదా పడటంతో, ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీ, వైకాపా, తెదేపా, భాజపాలు నాలుగు స్థంభాల ఆట మొదలుపెట్టేశాయి. ఇందులో పాల్గొంటున్న నాలుగు పార్టీలలో తెదేపా, భాజపాలు ఇంకా కలిసే ఆడుతుండటం విశేషం. ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలు కుమ్మక్కయి బిల్లుపై ఓటింగ్ జరుగకుండా వ్యవహరించి తపించుకొన్నాయని ఆరోపించింది. ఆ మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయని వైకాపా ఆరోపిస్తోంది.
ఈరోజు మధ్యాహ్నం వరకు తెదేపా ఎంపిలు ఆ బిల్లుకి ఓటు వేస్తారో లేదో కూడా చెప్పకుండా తప్పించుకొన్నారు. బిల్లుపై ఓటింగ్ జరుగకుండానే సభ వాయిదా పడినవెంటనే, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపిలు సిఎం.రమేష్, కేశినేని నాని ముగ్గురూ మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని ఆ బిల్లుకి అనుకూలంగా ఓటేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమని ఆదేశించారని, కానీ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడటంతో ఓటింగ్ జరుగకుండానే సభ వాయిదా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా ఎంపి విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “గత రెండేళ్లుగా మా పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది. దాని కోసం ఇవాళ్ళ ఒక మంచి అవకాశం వచ్చిందని మేము సంతోషిస్తే, భాజపా, తెదేపా, కాంగ్రెస్ పార్టీలు మూడు కలిసి బిల్లుపై ఓటింగ్ జరుగకుండా అడ్డుపడ్డాయి. ఈ బిల్లు ఆమోదం పొందకుండా సభలో భాజపా వ్యవహరించిన తీరు చూస్తే మోడీ ప్రభుత్వానికి, యూపియే ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదనిపించింది. ఇటువంటి నిరంకుశపోకడలు సరికాదు,” అని అన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, “ ఈ బిల్లుకి సభలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇస్తుంటే, భాజపా దానిని ముందుకు తీసుకువెళ్లకుండా అడ్డుపడింది. భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చాలా అన్యాయం చేస్తోంది. జి.ఎస్.టి. బిల్లుకి చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా ఉంటే, అప్పుడు మోడీ ప్రభుత్వం తప్పకుండా ప్రత్యేక హోదా బిల్లు ఆమోదింపజేస్తుందని భావిస్తున్నాము,” అని అన్నారు.