విడుదలకు ముందు కబాలి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈమధ్య కాలంలో ఏ సినిమాకీ రానంత హైప్ ఈ సినిమాకొచ్చింది. దాంతో రజనీ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయం అని గంపెడాశలు పెట్టుకొన్నారు అభిమానులు. ఈరోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కానీ.. టాక్ మాత్రం `భయంకరం`గా ఉండడం రజనీ ఫ్యాన్స్‌ని బాగా కలవరపెడుతోంది. టాక్ సంగతి అలా ఉంచితే.. ఈ సినిమాలోని రెండు డైలాగులు ఈ చిత్రాన్ని వివాదాస్పదంగా మారుస్తాయేమో అన్న కలవరం కలుగుతోంది. `గాంధీ కోటు వేసుకోకపోవడానికీ, అంబేద్కర్ కోటు వేసుకోవడానికి వెనుక చాలా రాజకీయం ఉంది` అనే డైలాగ్ ఇప్పుడు వివాదరం రేపడానికి రెడీగా ఉంది.
గాంధీనీ, అంబేద్కర్‌ని సినిమా డైలాగుల్లో చొప్పించడానికి చాలా ఖలేజా ఉండాలి. పైగా ఆ సందర్భం కూడా ఈ సినిమాలో అతకలేదు. ఏదో ఓ బలమైన ఇంటెన్సిటీతోనే దర్శకుడు ఈ డైలాగ్ రాసుకొన్నాడనిపిస్తోంది. దర్శకుడు రంజిత్ పాకి అంబేద్కర్ ఇజంపై గురి ఎక్కువ. రజనీకాంత్‌కి షూటింగ్ సమయంలో అంబేద్కర్‌కి సంబంధించిన ఎన్నో పుస్తకాల్ని బహూకరించాడట. అంబేద్కర్‌ని టాప్ టూ బోటమ్ చదివిన రంజిత్… ఈ డైలాగ్ ఎందుకు వాడాడో. క్లైమాక్స్సీన్లో `నేను పుట్టిందే రాజ్యాధికారం కోసం` అనే టైపులో ఓడైలాగ్ ఉంది. ఈ డైలాగ్ రజనీకాంత్ పలకడంతో…ప్రాధాన్యం సంతరించుకొంది. తమిళ నాట రజనీ రాజకీయల్లోకి వస్తారని, రావాలని చాలామంది కోరుకొంటున్నారు. రజనీమాత్రం ‘నో’ చెబుతున్నా.. సినిమాల్లో మాత్రం ఇలాంటి డైలాగులు పలికి అభిమానుల్ని ఆలోచనల్లో పడేస్తున్నాడు. ఇంకొంతకాలం ఈ రెండు డైలాగులూ హాట్ టాపిక్‌లో ఉండడం ఖాయం.