• ప్రతిపక్షం గొంతు నొక్కడంలో కాంగ్రెస్ బిజెపి ఒకటే
• కెవిపి బిల్లు గెలిచినా ప్రత్యేకహోదా రాదు
• ఎపికి కాంగ్రెస్ ద్రోహం బిజెపి మోసం
అపుడు కాంగ్రెస్ పార్టీ కరెంటుతీసి, పార్లమెంటు తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదించింది…ఇపుడు బిజెపి సంబంధం లేని అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తి ప్రత్యేక హోదాపై ప్రయివేట్ మెంబర్ బిల్లు ని ఓటింగ్ కు రాకుండా చేసింది. రెండు పార్టీలూ కలసి ఆంధ్రప్రదేశ్ గొంతు కోశాయి.
రాజ్యసభలో ఓటింగ్ జరిగినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చేస్తుందా? అంటే రాదనే చెప్పాలి! అయినా కూడా ప్రతి పక్షం గొంతునొక్కే నీతిలో కాంగ్రెస్, బిజెపిల మధ్య ఎంతమాత్రమూ తేడాలేదని మరోసారి రుజువైపోయింది. ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లుపై ”కర్రవిరగని పాము చావని” మిత్రపక్షాల తెరవెనుక నాటకం గురించి ‘తెలుగు 360 డాట్ కామ్’ ముందే చెప్పింది.
బిజెపి అనుకున్న ప్రకారమే కాంగ్రెస్ ఎత్తుగడను దెబ్బతీసి గెలుపొందింది. అయితే ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుల ఆదర,గౌరవ,మర్యాదల నుంచి పాతాళంలోక పతనమైపోయింది.
ఆప్రకారమే బిజెపి సభ్యులు సభను పదేపదే స్తంభింపజేసి బిల్లు చర్చకు రాకుండా వాయిదా వేయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ్యుడు తన నివాసం నుంచి పార్లమెంటులోకి వెళ్ళే వరకూ ప్రతీదీ వీడియో తీసి సోషల్ మీడియాలో వుంచి పార్లమెంటు భద్రతకు ముప్పుకలిగించారు కాబట్టి ఆయన పై చర్యతీసుకోవాలన్నది బిజెపి డిమాండు. ఇది రాజ్యసభకు సంబంధంలేని విషయం.అయినా కూడా వారు సభను స్తంభింపజేశారంటే అది ఎందుకో ఎవరికైనా అర్ధమైపోతుంది… ఈగొడవవల్ల రాజ్యసభ సోమవారం నాటికి వాయిదా పడింది.
అయితే ఆ రోజు కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు ఏపికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రైవేటు సభ్యుడి బిల్లు చర్చకు రాదు. వచ్చే శుక్రవారం నాడే చర్చకు వస్తుంది. స్వల్పకాలిక చర్చ అనంతరం అవసరమైతే ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ చర్చకు చైర్మన్ అవకాశమిచ్చి, బిల్లును ప్రతిపాదించిన సభ్యుడు (కెవిపి) ఓటింగ్‌కు పట్టుబడితే అప్పుడు కచ్చితంగా ఓటింగ్ జరపక తప్పదు. అదే పరిస్థితి ఏర్పడితే మూజువాణి ఓటుతో రాజ్యసభలో బిల్లు ఆమోదానికి సభానాయకుడు అంగీకరించవచ్చు. కానీ, అంతకంటే ముందు బిల్లును ఉపసంహరించుకోవలసిందిగా సభానాయకుడు అరుణ్‌జైట్లీ కానీ, పాలక పక్షానికి చెందిన మరో సీనియర్ మంత్రి కానీ సభ్యుణ్ణి కోరతారు.
బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే అరుణ్‌జైట్లీకి కెవిపి లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ, వాటికి ప్రభుత్వం తరపున పరిష్కారాలను చూపించే అవకాశం ఉంది. లేదా ఆ అంశాలను పరిశీలించి ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తామని చెప్పవచ్చు. ఆ తరువాత బిల్లు ఉపసంహరణకు కెవిపిని ఆయన కోరతారు. అయితే అందుకు కెవిపి అంగీకరించకపోతే ఓటింగ్ తప్పదు.
ఈ దశలో మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ చైర్మన్ ఆమోదిస్తారు. ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఇప్పటికే సూచనా ప్రాయంగా తెలిపారు.
అయితే రాజ్యసభ ఆమోదించినంత మాత్రాన బిల్లు చట్టరూపంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయంగా రచ్చగా మారిన ఈ వివాదానికి తెరదించటమే అధికార పార్టీ లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయం బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ నేత కెవిపి సహా దానికి మద్దతునిస్తున్న తెలుగుదేశం సహా అన్ని పార్టీలకూ తెలుసు. అయినా రాజకీయ ప్రయోజనాలే వారికి ముఖ్యం.
ఇంతవరకూ ఆమోదం పొందిన ప్రైవేటు సభ్యుల బిల్లులు కేవలం పధ్నాలుగే. వీటిలో సగం 1956లో ఆమోదం పొందినవే. అంతే కాదు, 1956లో ఆమోదం పొందిన సుప్రీం కోర్టు( ఎన్‌లార్జ్‌మెంట్ క్రిమినల్ అప్పిలేట్ జ్యూరిస్డిక్షన్) బిల్లు 1970లో కానీ చట్టరూపం దాల్చలేదు. అది కూడా ఆ బిల్లును ప్రభుత్వం తనదిగా చేసుకుని చట్టరూపంలోకి తెచ్చింది.
గత ఏడాది రాజ్యసభ ఆమోదించిన ట్రాన్స్‌జెండర్ బిల్లు ఇప్పటికీ లోక్‌సభకు రానేలేదు. కేవలం పెద్దల సభలో మెజారిటీ ఉన్నందువల్లే అక్కడ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా బిల్లుది కూడా అదే పరిస్థితి.