తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండేళ్ళు దాటింది.ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా రాష్ట్రంలో అడుగుపెట్టలేదు కానీ రెండేళ్లలో 55 దేశాలు చుట్టి వచ్చారని తెరాస నేతలు తరచూ విమర్శిస్తుంటారు. తెరాస చేస్తున్న ఆ విమర్శల వలన ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజలలో దురాభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని, అది తమ పార్టీ మీద ప్రభావం చూపే ప్రమాదం ఉందని రాష్ట్ర భాజపా నేతలెవరైనా ఆయనకి చెప్పారో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా కొత్త రాష్ట్రంలో అడుగుపెట్టలేదు.
తనంతట తానుగా ఆయన రాష్ట్రానికి రారని గ్రహించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనని రప్పించడానికి ‘ఆపరేషన్ మిషన్ భగీరథ’ని అమలుచేసినట్లున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి పదకాలని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చాలా మెచ్చుకొన్నారు. కనుక మిషన్ భగీరధ ప్రారంభోత్సవానికి రావలసిందిగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ ఆహ్వానించారు. దానిని కాదనడానికి కారణాలు ఏమీ లేవు కనుక ఆయన అంగీకరించారు. ఆ విధంగా తెలంగాణాకి రాని ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కెసిఆరే ఎప్పుడు రావాలో డేట్ కూడా ఫిక్స్ చేసి మరీ రప్పించుకొంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 7న తెలంగాణా వస్తారని ఆయన కార్యాలయ అధికారులు తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేశారు. తెలంగాణా ప్రభుత్వంతో చర్చించిన తరువాత ఆయన పర్యటన వివరాలు ఖరారు చేస్తారు.
ఆయన మొట్టమొదటిసారిగా తెలంగాణా రాష్ట్రానికి వస్తున్నారు కనుక దాని వలన ఏమైనా ప్రయోజనం కలిగితే అది రాష్ట్ర భాజపాకి దక్కాలి కానీ తెలంగాణా ప్రభుత్వం ఆయన కోసం సిద్దం చేస్తున్న చాంతాడంత ప్రారంభోత్సవాల జాబితా చూసినట్లయితే ఆయన రాష్ట్ర భాజపా నేతలతో కనీసం మాట్లాడే అవకాశమైన ఉంటుందో లేదో అనే అనుమానం కలుగుతోంది. ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి మళ్ళీ డిల్లీ తిరిగి వెళ్ళేవరకు తీరికలేకుండా అనేక కార్యక్రమాలలో పాల్గొనవలసి రావచ్చు.
మొట్ట మొదటగా గజ్వేల్ ల్లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవం చేస్తారు. అదేరోజున ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ లలోనే సుదర్శన యాగం చేయబోతున్నారు. అటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రధాని మోడీ దానికి హాజరు కాకుండా ఉండరు. అనంతరం వరంగల్ ల్లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం ఉంటుంది. వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదలచుకొన్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ శంఖుస్థాపన కార్యక్రమం ఉంది. వరంగల్లోనే మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. రామగుండంలో ఎన్.టి.పి.సి. విద్యుత్ ప్లాంట్ కి శంఖు స్థాపన, ఆదిలాబాద్ లో మరో రెండు విద్యుత్ ప్లాంట్లని జాతికి అంకితం చేయవలసి ఉంది. ములుగు మండల కేంద్రంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. వీలైతే ప్రధాని నరేంద్ర మోడీ దానిలో కూడా పాల్గొనవచ్చు.
ఈ కార్యక్రమాల జాబితాని తెలంగాణా ప్రభుత్వం ప్రధాని కార్యాలయానికి పంపించింది. వాటిలో ఎన్నిటిని ఆమోదిస్తారో ఇంకా తెలియవలసి ఉంది. వాటిలో ఏ ఒక్కటీ తిరస్కరించలేని విధంగా రూపొందించినందుకు కూడా కెసిఆర్ ని మెచ్చుకోక తప్పదు.