కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకి చెందిన విజయవాడలోని స్వర్ణా బార్ లో గత ఏడాది మద్యం త్రాగి ఏడుగురు చనిపోయారు. మరో 23మంది వరకు అస్వస్థులయ్యారు. ఆ సంఘటన రాష్ట్రంలో చాలా కలకలం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు ఎక్సైజ్ శాఖాధికారులు మద్యం షాపు నుంచి కొన్ని మద్యం సీసాలని స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షలకి పంపారు. ఆ నివేదిక ఇప్పటికి ఆ కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసుల చేతికి వచ్చింది. వారు స్వాధీనం చేసుకొన్న 30 మద్యం సీసాలలో 26 సీసాలలో అత్యంత ప్రమాదకరమైన సైనేడ్ విషం కలిసుందని ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొంది. వాటిలోకి ఆ విషం ఏవిధంగా చేరిందో పోలీసులు దర్యాప్తు చేసి కనుగొనవలసి ఉంది. పోలీసులు ఫోరెన్సిక్ నివేదికని విజయవాడ కోర్టుకి సమర్పించారు. ఇది చాలా తీవ్రమైన విషయం కనుక న్యాయస్థానం కూడా అందుకు తగ్గట్లుగానే స్పందించవచ్చు. విషప్రయోగం కారణంగానే ఏడుగురు మృతి చెందినట్లు నిరూపించబడింది కనుక మల్లాది విష్ణు, ఆ బార్ యజమానులుగా ఉన్న ఆయన కుటుంబ సభ్యులు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరుగక తప్పదు. గత ఏడాది ఆ సంఘటన జరిగిన తరువాత మల్లాది విష్ణు దాదాపు నెలరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత వచ్చి పోలీసులకి లొంగిపోయారు. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది కనుక మళ్ళీ మాయం అయిపోతారేమో? ఈ కల్తీ మద్యం కారణంగా ఆయన రాజకీయ జీవితం కూడా దెబ్బ తింది. ఈ సంఘటన జరిగియన్ తరువాత ఆయన విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కోల్పోయారు. మొదట కాంగ్రెస్ పార్టీ ఆయనకి అండగా నిలబడి మాట్లాడినప్పటికీ కేసు తీవ్రత గమనించి ఆయనకి దూరం అయ్యింది.