రాజకీయాల్లోని కుళ్లును కడిగేస్తామనే పార్టీ, తానే కుళ్లు రాజకీయాలకు పాల్పడుతోంది. ఇతర పార్టీల కంటే భిన్నమైన పార్టీ, వాటిని మించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నైతిక విలువలను పట్టించుకోవడం క్రమంగా మానేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ ఎంపీ భగవంత్ సింగ్ మాన్ పార్లమెంటు ఆవరణలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని కూడా ఆప్ నేతలు అడ్డంగా సమర్థిస్తున్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని కోరుతున్న బీజేపీనే విమర్శిస్తున్నారు.
మన పార్లమెంటుపై ఇప్పటికే ఓసారి దాడి జరిగింది. అప్రమత్తంగా ఉన్న భద్రతా సిబ్బంది, పార్లమెంటు సిబ్బంది ప్రాణ త్యాగం చేసి మరీ పార్లమెంటును కాపాడారు. ఆనాడు ఉగ్రవాదులకు పార్లమెంటు లోపలి విషయాలు తెలియవు. ఇప్పుడు ఆప్ ఎంపీ తీసిన వీడియో వల్ల గేటు నుంచి పార్లమెంటు భవనం వరకు ఎక్కడెక్కడ సెక్యూరిటీ పోస్టులున్నాయి, ఎక్కడ భద్రతా సిబ్బంది ఉంటారనే విషయాలు తెలిసిపోయాయి. ఈ వీడియో చూసి ఉగ్రవాదులు మరోసారి దాడికి స్కెచ్ వేస్తే అడ్డుకోవడం కష్టం కావచ్చు.
ఈపాటి కామన్ సెన్స్ కూడా లేని ఆప్ ఎంపీ వీడియో తీయడమే కాదు, టీవీ యాంకర్ తరహాలో రన్నింగ్ కామెంటరీ కూడా చెప్పారు. జీరో అవర్ లో ప్రశ్నలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం నచ్చకపోతే ఆ విషయాన్ని సభలో ప్రస్తావించ వచ్చు. లేదా బయట మరో విధంగా నిరసన తెలపవచ్చు. అలా చేయకుండా మతిలేని పనిచేయమే కాదు, దాన్ని సమర్థించుకున్నారు. మరోసారి ఇలాగే చేస్తానని గురువారం బీరాలు పలికారు. శుక్రవారం ఉదయం కూడా తన పనిని సమర్థించుకున్నారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలిచి ప్రశ్నించే సరికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఇది ఇంత పెద్ద వివాదం అవుతుందని అనుకోలేదంటూ ఆన్ లైన్ లో ట్వీట్ చేశారు. ఇంతా జరిగాక తన ఫేస్ బుక్ ఎకౌంట్ నుంచి ఈ వీడియోను తొలగించారు.
ఓ వైపు మాన్ క్షమాపణ చెప్పగా, మరో వైపు ఆప్ నేతలు చాలా మంది ఆయన్ని సమర్థించారు. బీజేపీని విమర్శించారు. ఆయనపై చర్య తీసుకోవాలంటూ బీజేపీ వారు డిమాండ్ చేయడం నీతిమాలిన పని అంటూ మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుల భద్రతను పణంగా పెట్టడాన్ని కూడా సమర్థించే స్థాయికి ఆప్ నేతలు ఎదిగారో లేక దిగజారారో వాళ్లకే తెలియాలి.
తమ పార్టీ వాళ్లు చేసిన ప్రతి తప్పుడు పనినీ సమర్థించడంలో కేజ్రీవాల్ బృందం ఆరితేరింది. ఆ మధ్య ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ను నకిలీ లా డిగ్రీ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అంతే, అది నిజమో కాదో తెలుసుకోకుండా కేజ్రీవాల్ రంకెలు వేశారు. మోడీ ప్రభుత్వాన్ని విపరీతంగా తిట్టారు. తీరా, తోమర్ నకిలీ డిగ్రీ పొందింది నిజమేనని తెలిసి గతుక్కుమన్నారు. నాలుక్కరుచుకున్నారు. తోమర్ ను నమ్మి మోసపోయానంటూ అసెంబ్లీలో ప్రకటించారు. తోమర్ ను మంత్రి పదవి నుంచి తొలగించారు.
ఇలా చాలాసార్లు జరిగింది. పంజాబ్ లో గెలవడానికి ఆప్ నేతలు ఓటు బ్యాంకు రాజకీయాల వేగం పెంచారు. ఎక్కడో ఉన్న పంజాబ్ లో ఎక్కువ మంది మాట్లాడే పంజాబీ భాషను ఢిల్లీలో రక్షిస్తామని ప్రకటించారు. ఢిల్లీలోని సర్కారీ స్కూళ్లలో పంజాబీని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఎన్నో ఎత్తులు వేస్తూనే ఉన్నారు.