భారతీయ జనతా పార్టీ కి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం లాంఛనమే అనే వార్తలు వస్తున్నప్పటికీ ఈ రెండు వర్గాల మధ్యనా ఇప్పుడు చర్చలు ఇంకా కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. అనధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 25 వ తేదీన సిద్ధూ మీడియా ముందుకు వచ్చి బీజేపీలో చేరే విషయాన్ని ప్రకటించనున్నాడు. అయితే సిద్దూ పెట్టిన కండీషన్లు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక విధంగా కలవరాన్నే రేపుతున్నాయని తెలుస్తోంది.
సిద్దూ పెట్టిన కండీషన్లు ఏమనగా.. తనను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ శాఖ విషయంలో కేజ్రీవాల్ ఆధిపత్యం ఉండకూడదు, ఒకవేళ పంజాబ్ లో ఆప్ అధికారంలోకి రాకపోతే తనను పార్టీ తరపున రాజ్యసభకు పంపాలి.. ఇవీ సిద్దూ కోరికలు. వీటిలో కొన్నింటి పట్ల సుముఖంగానే ఉన్నా ఆప్ అన్ని కోరికలకూ ఓకే చెప్పే పరిస్థితి మాత్రం లేదు!
పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సిద్దూని ఆప్ ఆహ్వానిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ముందుగా ప్రకటించడానికి మాత్రం ఆ పార్టీ తటపటాయిస్తోంది. అన్నీ కుదిరితే తను ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి.. అక్కడ సిసోడియాకు బాధ్యతలు అప్పగించి, పంజాబ్ కు సీఎంగా వచ్చేయలన్నది కేజ్రీవాల్ కోరిక. ఇలాంటి నేపథ్యంలో సిద్దూను ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కష్టమే. అలాగే కేజ్రీవాల్ ఆధిపత్యం పంజాబ్ శాఖపై ఉండకూడదని సిద్దూ కోరడాన్ని కూడా ఆప్ సహించలేకపోవచ్చు. ఇక మూడోది.. పంజాబ్ లో ఆప్ అధికారంలోకి రాకపోతే సిద్దూను రాజ్యసభకు పంపే ప్రతిపాదన పట్ల మాత్రం ఆప్ కు అభ్యంతరాలు లేవు. మరి ప్రస్తుతానికి వీటిపై చర్చలు జరుగుతున్నాయి. మరి ఏ మేరకు రాజీ కుదురుతుందో!