ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్.. రఘువీరారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో భవితవ్యం లేదు అని క్లారిటీ వచ్చిన తర్వాత కూడా సొంత ఖర్చులతో పార్టీల కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు అనే పేరును తెచ్చుకున్న వ్యక్తి! అవకాశం ఉన్న వాళ్లు సార్వత్రిక ఎన్నికల ముందే కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం, వైకాపా, బీజేపీల్లో చేరిపోయారు. ఇక మిగిలిన వాళ్లు ఎన్నికలు అయిపోయాకా.. ఆయా పార్టీల్లో చేరిపోయారు. అయితే రఘువీరారెడ్డి మాత్రం ఎవరూ స్వీకరించడానికి కూడా సిద్ధపడని పీసీసీ పదవిని తీసుకుని.. ఆ పార్టీలోనే ఉన్నాడు.
మరి ఈ విధంగా కాంగ్రెస్ లోనే ఉన్నాను.. ఉంటాను.. అనిపిస్తున్నా.. రఘువీరారెడ్డి పట్ల ఆసక్తికరమైన అంశాలు ప్రచారంలోకి వస్తున్నాయి. రఘువీర కాంగ్రెస్ లో ఉన్నా, ఈయనకు తెలుగుదేశం తో సన్నిహిత సంబంధాలే ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తు ఉంటాయి. ప్రత్యేకించి ఈయన సొంత జిల్లా అనంతలో తెలుగుదేశం తరపున కీలక స్థానంలో ఉన్న మంత్రులతోనే రఘువీరకు సన్నిహిత సంబంధాలున్నాయంటారు.
అంతే కాదు.. తన అనుచరుడు తిప్పేస్వామికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ పదవిని ఇప్పించుకునేంత సమర్థత రఘువీరకు ఉందని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. మరి ఎన్నోయేళ్లు తెలుగుదేశం పార్టీ లో పని చేసిన వారికే ఎమ్మెల్సీ పదవులు దక్కడం కష్టం. అలాంటిది ఎన్నికల ముందు తన అనుచరుడిని టీడీపీలోకి పంపి.. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించడంటే.. టీడీపీలో రఘువీరారెడ్డికి ఉన్న పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తుంటారు. అంతేగాక మంత్రులతో సాన్నిహిత్యంతో తన పనులను చక్కబెట్టుకోవడంలో కూడా రఘువీర ముందున్నాడని అంటారు. మొత్తానికి కాంగ్రెస్ లో ఉండి కూడా ఈ మాత్రం చక్కబెట్టుకుంటున్నాడంటే రఘువీరరెడ్డి విషయం ఉన్న వ్యక్తే!