సూపర్ స్టార్ రజనీ కాంత్ పేరుతో హైప్ సృష్టించే దేశాల సంఖ్య పెరుగుతోంది. ఆయన సినిమాలకు థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. చివరకు, రజనీ సినిమా దెబ్బకు దివాళా తీసే బయ్యర్ల సంఖ్య కూడా పెరుగుతోంది అంటున్నారు విమర్శకులు.
కోచ్చడాయన్, లింగ తర్వాత కబాలీ బయ్యర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తొలిరోజే భయంకరమైన ఫ్లాప్ టాక్ వచ్చింది. మొన్నీ మధ్యే రెండు టాప్ హీరోల తెలుగు సినిమాలకూ ఇలాగే ఫ్లాప్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద పేలిపోయాయి. కబాలీని చూసి భరించడం కష్టమని తల పట్టుకునే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. చివరకు రజనీ వీరాభిమానులు కూడా నిరాశతో థియేటర్లోంచి బయటకు వస్తున్నారు.
కోచ్చడాయన్ తెలుగు వెర్షన్ నిర్మాతకు రజనీకాంత్ కుటుంబం 7.5 కోట్లు బాకీ ఉందనేది వివాదాస్పదంగా మారింది. ఆ సినిమా నాకు వద్దని ఆయన మొత్తుకున్నా అంటగట్టారని, నష్టం వస్తే భరిస్తామని రజనీ భార్య హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. 10 కోట్లు పెట్టుబడి పెడితే రెండున్నర కోట్లే రికవరీ అయ్యాయట. మిగతా సొమ్మును రజనీ భార్య ఇస్తారని ఆశిస్తే అలా జరగలేదు.
లింగ బయ్యర్లు చెన్నైలో తరచూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. రజనీ కొత్త సినిమాను అడ్డుకోవడానికి కోర్టు కేసుల ద్వారా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కబాలీ విడుదలను అడ్డుకోవడానికి కూడా హైకోర్టును ఆశ్రయించి విఫలమయ్యారు.
రజనీ కాంత్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారో లేక ఆయన పేరు మీద వ్యాపారం పేరిట జూదం నడుస్తుందో గానీ గత కొంత కాలంగా ఆయన సినిమాలు కొందరిని టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పుడు కబాలీకి వచ్చినంత ఫ్లాప్ టాక్ రజనీ సినిమాలకు ఎప్పుడూ రాలేదంటున్నారు. విమానాలకు కబాలీ బొమ్మలు. కబాలీ నాణేలు, కంపెనీలకు సెలవులు అంటూ అతిగా హైప్ జరిగిన సినిమా బాక్సాఫీసు వద్ద ఢాం మంది. ఇప్పటికే టికెట్లు కొనుక్కున్న వారు తప్పదన్నట్టు సినిమా చూస్తున్నారు. కొత్తగా సినిమా చూసే వాళ్లు తగ్గిపోతున్నారు.
రోబో 2 ఎంత మందిని ముంచుతుందో అంటూ అప్పుడే చర్చ మొదలైంది. 350 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సినిమా తీస్తున్నారని టాక్.
బాలీవుడ్ చరిత్రలో 700 కోట్లు వసూలు చేసిన ఆమిర్ ఖాన్ సినిమా పి.కె. పెట్టుబడి 85 కోట్లు. సల్మాన్ ఖాన్ సుల్తాన్ బాక్సాఫీసు వద్ద మోత మోగిస్తోంది. దాని పెట్టుబడి 70 కోట్లు. మరి రజనీ కాంత్ సినిమాకు 350 కోట్లు పెట్టుబడి పెట్టారంటే తిరిగి రాబట్టుకోవడానికి ఏరియాల వారీగా, జిల్లాల వారీగా ఏ రేంజిలో అమ్ముకుంటారో ఊహించ వచ్చు. తీరా అది కూడా కోచ్చడాయన్, లింగ, కబాలి కి కజిన్ గా మారితే? అట్టర్ ఫ్లాప్ అయితే? ఎంత మంది బయ్యర్లు రోడ్డున పడతారో.
ముందు ముందు రజనీ సినిమా అంటే కొనడానికి భయపడే పరిస్థితి వచ్చిందనే టాక్ పెరుగుతోంది. కాబట్టి తన బ్రాండ్ ఇమేజి మరింత డామేజీ కాకముందే రజనీ కాంత్ రిటైర్ కావడం మంచిదని విమర్శకులు ఉచిత సలహా ఇస్తున్నారు. రజనీ వీరాభిమానులు మాత్రం ఆయనకు ఇంకా చాలా కాలం వెండితెరను ఏలే స్టామినా ఉందని నమ్ముతున్నారు.