కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కాశ్మీర్ లో పరిస్థితులని సమీక్షించేందుకు శనివారం కాశ్మీర్ చేరుకొన్నారు. ఈరోజు రేపు ఆయన భద్రతాదళాల ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, ప్రతిపక్ష నేతలతో, స్థానిక ప్రముఖలతో వరుసగా సమావేశం అవుతారు. మళ్ళీ రేపు మధ్యాహ్నం డిల్లీ చేరుకొంటారు. ఆయన కాశ్మీర్ చేరుకోగానే స్థానిక ప్రముఖలతో సమావేశం అవ్వాలనుకొన్నారు. కానీ ఆయనని కలిసేందుకు అతికొద్ది మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.
కాశ్మీర్ లో జరిగిన అల్లర్లలో 47మంది చనిపోయారు సుమారు 2,000 మందికి పైగా గాయపడ్డారు. గతంలో ఇటువంటి అల్లర్లు జరిగినప్పటికీ ఇన్ని రోజులు సాగలేదు..ఇంతమంది మరణించలేదు..గాయపడలేదు. ఈ అల్లర్లని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించడం, వారికి సంఘీభావం తెలపడం, మరణించిన ఉగ్రవాదిని కాశ్మీర్ స్వాతంత్ర సమరయోధుడుగా ప్రకటించి అతని మృతికి సంతాపంగా బ్లాక్-డేకి పిలుపునివ్వడం వంటివన్నీ అల్లర్ల వెనుక పాక్ హస్తం ఉందని నిరూపిస్తున్నాయి. అందుకే ఈసారి ఇంత తీవ్ర స్థాయిలో అల్లర్లు..పోలీస్ స్టేషన్లపై గ్రెనేడ్ దాడులు, ఆయుధాల అపహరణ వంటి సంఘటనలు జరిగాయని చెప్పవచ్చు. ఈ అల్లర్లు కాశ్మీర్ లో వేర్పాటువాదం ఏ స్థాయిలో ఉందో కళ్ళకి కట్టినట్లు చూపించాయి. కనుక ఇకపై పాక్ ప్రభుత్వం, ఉగ్రవాదులు, వేర్పాటువాదులు చేతులు కలిపి పకడ్బందీగా పూర్తి సన్నాహాలు చేసుకొని ఇంకా తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిపే అవకాశం ఉన్నట్లే భావించవచ్చు. మళ్ళీ ఇటువంటి అల్లర్లు జరిగితే బహుశః అవి చిన్నపాటి యుద్ధంగా మారినా ఆశ్చర్యం లేదు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి నుంచి గుణపాఠం నేర్చుకొని, మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. తమ రాజకీయాలు, బేషజాలని పక్కనబెట్టి దేశ భద్రత గురించి సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం ఉంది.