దేశంలో మొట్టమొదటిసారిగా చిత్తూరులో 2011లో ‘మీ సేవ’ కేంద్రాన్ని ప్రారంభించారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి అవి 7,000కి పైనే ఉన్నాయి. మొదట కేవలం 10 రకాల సేవలు మాత్రమే అందించే మీ సేవ కేంద్రాలు ఇప్పుడు సుమారు 348 రకాల సేవలు అందిస్తున్నాయి. వాటి వలన ప్రజలకి చాలా సౌకర్యం కలగడమే కాకుండా అనేకమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాయి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడానికి ఎప్పుడూ ముందుండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దానిని మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకి కూడా అందుబాటులో తేవాలని ఎపుడూ ప్రయత్నిస్తుంటారు. అటువంటి మరో ఆలోచనే కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘జాతీయ ఈ గవర్నెన్స్’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అన్ని పంచాయితీ స్థాయిలో మీ సేవ కేంద్రాలని ఏర్పాటు చేయడం.
ముఖ్యమంత్రి శనివారం విశాఖ పర్యటించినప్పుడు ఈ విషయం ప్రకటించారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలో 485 మీ సేవ సెంటర్లు విజయవంతంగా పనిచేస్తున్నాయని, త్వరలో పంచాయితీ స్థాయిలో మరో 100 మీ సేవా కేంద్రాలని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మున్ముందు అన్ని జిల్లా పంచాయితీలలో కూడా మీ సేవా కేంద్రాలని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సాధారణంగా ప్రభుత్వ పధకాలలో కొన్ని మాత్రమే ఈవిధంగా విజయవంతం అవుతుంటాయి. మీ సేవా కేంద్రాలు విజయవంతం అవడానికి కారణం, అవి చక్కగా పనిచేసేందుకు అవసరమైన వ్యవస్థని, విధివిధానాలని ఏర్పాటు చేయడం, వాటి ద్వారా ప్రజలకి అవసరమైన అనేక రకాల సేవలు అందుబాటులోకి తీసుకు రావడమేనని చెప్పవచ్చు.
కనుక ప్రభుత్వాలు ఏదైనా పధకం లేదా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించేముందు ఈవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఏర్పాట్లు చేసినట్లయితే అన్నీ విజయవంతం అవుతాయి. ప్రభుత్వానికి మంచిపేరు తెస్తాయి. ఇప్పుడు ఫోన్, టీవీ, కంప్యూటర్ ప్రతీ ఇంటిలో కనబడుతుంటాయి. కనుక ఫోన్ సర్వీస్, ఇంటర్నెట్ సర్వీస్, టీవీ ఛానల్ ప్రసారాలని నెలకి కేవలం రూ.150కే అందించేందుకు చంద్రబాబు నాయుడు ఒక భారీ పధకాన్ని ప్రారంభించారు. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే ఆ పధకం కూడా అమలుచేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ పధకం కూడా ఇలాగే విజయవంతం అయితే, దేశంలో నామమాత్ర ధరకే మూడు రకాల సేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది.