తెలంగాణలో ఒకే సీజన్లో 46 కోట్ల మొక్కలు నాటాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. చివరి మొక్కు నాటే వరకూ ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అసలు 46 కోట్ల మొక్కలను నాటినట్టు గ్యారంటీ ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదో పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఇదివరకే ఆరోపించారు.
హరిత పరిహారం కార్యక్రమంలో పనితీరే అధికారులకు గీటు రాయి అంటున్నారు కేసీఆర్. తాను స్వయంగా గ్రామాలకు వెళ్లి మొక్కలను పరిశీలిస్తానన్నారు. ఒక్క మొక్క కూడా ఎండి పోవడానికి వీల్లేదన్నారు. గత ఏడాది కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. వాటిలో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఎండిపోయాయో లెక్కలు లేవు.
ఈ కార్యక్రమం నామ్ కే వాస్తే గా మారిందని, నిధులు ఖర్చు కావడం తప్ప ప్రయోజనం అనుమానమేనని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శించడానికి మరో కారణం దొరికింది. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి హరీష్ రావు కే ఓ చేదు అనుభవం ఎదురైంది.
మెదక్ జిల్లా పుల్కల్ పర్యటనకు వెళ్లిన హరీష్ రావు, సింగూరు జలాశయం పంప్ హౌస్ వద్ద మొక్కను నాటారు. అవునూ, గత ఏడాది కూడా ఇక్కడే మస్తు మస్తు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం కదా అనే విషయం గుర్తుకు వచ్చింది. అప్పుడు నాటిన మొక్కల జాడ కనిపించ లేదు. అవి ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. వాళ్లు జవాబు చెప్పకుండా నీళ్లు నమిలారు. మంత్రికి విషయం అర్థమైంది. ఆనాడు నాటిన మొక్కలు గోవిందా అని అధికారులు చెప్పలేకపోతున్నారని అర్థం చేసుకున్నారు. వాళ్లమీద ఆగ్రహించారు. ఆగ్రహిస్తే మాత్రం, ఎండిపోయిన మొక్కలు తిరిగి వస్తాయా?
ఈ ఏడాది నాటే కోట్లాది మొక్కలు వచ్చే ఏడాదికి క్షేమంగా బతికుంటాయో ఎండిపోతాయో చెప్పలేం. నాటిన నాలుగు రోజుల తర్వాత పరిశీలించడం కాదు, ఓ ఏడాది తర్వాత అసలు సంగతి ఆరా తీస్తే నిజం బయట పడుతుంది. హరిత హారం కోసం వెచ్చించే ప్రజాధనం వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మొక్కుబడిగా మొక్కలు నాటి, ఫొటోలకు పోజులిస్తే చాలనుకుంటే ఇంత మంచి కార్యక్రమం కూడా ఇంతే సంగతులు!