కృష్ణా పుష్కరాలకు ముందుగా ప్రచారం చేయనవసరంలేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిసింది. గోదావరి పుష్కరాలకు నెలరోజుల ముందునుంచే రాష్ట్రప్రభుత్వం యాడ్ ఫిల్ముల ద్వారా, పేపర్ యాడ్ లద్వారా ప్రచారం మొదలు పెట్టింది. రాజమహేంద్రవరాన్ని ఒక బ్రాండ్ గా, గోదావరిని ఒక టూరిజమ్ ఐకాన్ గా, రకరకాల సర్వీసులకు ఒక స్టిమ్యులేటర్ గా గోదావరి పుష్కరాలను మలచుకోవాలని అందుకు ప్రచారం అవసరమని అప్పట్లో స్వయంగా చంద్రబాబే మీడియా సమావేశంలో చెప్పారు. అయితే ఆసూత్రాన్ని ఆగస్టు 12 న మొదలయ్యే కృష్ణా పుష్కరాలకు మాత్రం వర్తింపజేయడంలేదు.
విజయవాడ కేంద్రంగా పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు పుష్కర సన్నాహాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పుష్కర పనుల్లో లోపాలను ఆయన గుర్తించారు. అధికారుల్లో సమన్వయం కనిపించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయన్న విషయాన్ని గమనించారు. సీరియస్ అయ్యారు. పుష్కరాల కోసం ఇప్పటికీ ఒక్క ఘాట్ కూడా పూర్తిగా సిద్ధం కాకపోవడంపై కాంట్రాక్టర్ ను అరెస్ట్ చేయండి అనేటంతవరకూ వెళ్ళారు.
ఇప్పటికే విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. ఇక పుష్కరాల పేరుతో భారీ సంఖ్యలో యాత్రికులు తరలివస్తే ఏం జరుగుతుందోనన్న ఆదుర్దా ప్రభుత్వయంత్రాంగంలో బెజవాడ వాసుల్లోను కనిపిస్తోంది. అయినా సన్నాహాలు అరకొరగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతిగా ప్రచారం చేసి భారీ సంఖ్యలో జనాలను తరలిస్తే అసలుకే మోసం వస్తుందని ముఖ్యమంత్రితో సహా విజయవాడ నాయకులు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. పుష్కరాల నాటికి పూర్తిచేస్తామని చెప్పిన ఫ్లైఓవర్ పరిస్థితి దాదాపు పడకేసింది. ఇప్పటికీ సిద్ధం అవుతుందో తెలియని స్థితి ఉంది. ఈలోగా పిల్లర్లు కుప్పకూలి కలవరం కలిగిస్తున్నాయి.
ఏడాది క్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రచారం హోరెత్తించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రచారం శృతిమించడంతో తొలిరోజే తొక్కిసలాటలో 29 మంది చనిపోయిన సంఘటన మాయని మచ్చగా బాబుని వెంటాడుతోంది.
రాజమండ్రితో పోలిస్తే విజయవాడలో అంత సౌకర్యవంతంగా కనిపించదు. అలాంటి చోట లక్షల మంది పోగుపడితే ఇబ్బందులు వస్తాయి. దసరా లాంటి సందర్భంలో భవానీ భక్తుల రాకతోనే నగరం కిక్కిరిసిపోయి ఉంటుంది. అలాంటిది పుష్కరాల పేరుతో పెద్దగా ప్రచారం సాగిస్తే ఎక్కువ సంఖ్యలో జనం వస్తారు కనుక ఇప్పటినుంచే ప్రచారం చేయడం ఇబ్బందులు కొనితెచ్చుకోవడమేనని లెక్కలేస్తున్నట్టు సమాచారం. పుష్కరాలు ప్రారంభమయిన తర్వాత మాత్రమే ప్రచారం చేయవచ్చని ప్రభుత్వంలో పెద్దలు భావిస్తున్నారు.
అంతెందుకు గోదావరి పుష్కరాలకు రూపొందించిన లోగోకే కృష్ణా పుష్కరాలు అనే పేరు రాసి ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాల రావు కలసి విడుదల చేశారు.