పోలిస్ బాస్ పదవి నుంచి రిటైరైన జాస్తి వెంకట రాముడు తదుపరి ప్రస్థానం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రిటైరైన ఐపీఎస్ లు ఐఏఎస్ లు అంత ఈజీగా తెరమరుగు కారు. ఏదో ఒక వ్యాపకంతో, ఏదో ఒక వ్యవహారంతో వారు వార్తల్లో ఉండనే ఉంటారు. దీనికి ఇప్పుడు అనునిత్యం వార్తల్లో కనిపిస్తున్న అనేక మంది మాజీలే సాక్ష్యం. ఐపీఎస్ లు అయితే సాధారణంగా రాజకీయాలనే ఎంపిక చేసుకొంటూ ఉంటారు. ఈ పరంపరకు కొనసాగింపుగానే జేవీ రాముడు కూడా రాజకీయాల్లోకి వస్తాడని తెలుస్తోంది.
ఈయన రిటైర్మెంట్ వార్తలు వచ్చినప్పటి నుంచినే రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. రాముడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోబోతున్నాడని ఆ పార్టీ తరపు నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని అంటున్నారు. అంతే కాదు.. ఆయన పోటీ చేయబోయే నియోజకవర్గం ఏదో కూడా కన్ఫర్మ్ అయ్యిందనితెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఈయన అదే జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని భోగట్టా.
తన సొంతూరును దత్తత తీసుకుని వివిధ కార్యక్రమాలు చేపట్టిన జేవీ రాముడు.. ఈ ఊరు భాగమైన ధర్మవరం నియోవజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడని అంటున్నారు.తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే నియోజకవర్గంగా నిలుస్తుంది ఇది. అయితే ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం వ్యక్తే. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు వద్ద రాముడికి మంచి పలుకుబడి ఉందని.. సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి అయినా రాముడికి రాజకీయంగా బాబు అవకాశం ఇస్తాడని తెలుగుదేశం వారే అంటున్నారు. మరి ఈ మాజీ పోలీస్ బాస్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో!