నంద్యాల నుంచి తన పార్టీ తరపున గెలిచిన భూమా నాగిరరెడ్డి ఫిరాయింపుకు పాల్పడటంతో అక్కడ ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. గత కొన్ని నెలలుగా ఈ నియోజకవర్గానికి వైకాపా తరపున ఇన్ చార్జి ఎవరూ లేరు. ఈనేపథ్యంలో మలికి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని నంద్యాల నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించాడు జగన్. భూమా వెళ్లిపోయిన నేపథ్యంలో.. తప్పనిసరిగా ఈ ఎంపిక జరిగింది.
రాయలసీమ వరకూ వైకాపాకు ఫిరాయింపుల వల్ల పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. ప్రధానంగా పార్టీ ఇమేజ్ మీదే ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి కాబట్టి.. ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకోవడం కష్టం కాదు. అయితే.. ఎంతకాదనుకున్నా ఇది భూమా ఇలాకా, అధికారంలో ఉన్న సమయంలో భూమాను ఎదుర్కోవడం ఆయన ప్రత్యర్థులకు అంత ఈజీ కాదు. ఇలాంటి నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో వైకాపా జెండాను మోయడం అంత సులభం కాదు.
రేపో మాపో మంత్రి వర్గ విస్తరణ అని అంటున్నారు. అందులో గనుక భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి కూడా దక్కిందంటే ఆయన ప్రత్యర్థులకు హడలే. గత ఎన్నికల్లో వ్యక్తిగతం భూమాకు ఎదురుగాలే ఉండేది. అయితే పోలింగ్ దగ్గర బడ్డ సమయంలో భార్య శోభానాగిరెడ్డి మరణం సానుభూతిని కలిగించింది. దీంతో భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా సులభంగా విజయం సాధించాడనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు స్థానికులు. మరి వైకాపా ఇన్ చార్జి ప్రకటనతో ఇక్కడ కొత్త రాజకీయానికి తెరతీసినట్టు అయ్యింది. ముందు ముందు ఏం జరగనుందో!