మరో సావిత్రి.. మరో సౌందర్య అంటూ కితాబులందుకొన్న నటి నిత్యమీనన్. అలా మొదలైందితో భలేగా ఆకట్టుకొంది. తెలుగుమ్మాయి కాకపోయినా, తెలుగు నేర్చుకొని, సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని, పాటలు కూడా పాడేస్తూ… మన అమ్మాయే అనిపించుకొంది. కథల ఎంపికలోనూ నిత్య తనదైన ముద్ర వేసింది. నిత్య ఓ సినిమా ఉందంటే అందులో విషయం ఉండే ఉంటుందన్న ధీమా కల్పించింది. హీరోలతో పాటు పోటీ పడి నటించింది. ఇప్పటికీ నిత్య టాలెంట్‌ని తక్కువ అంచనా వేయలేం. కానీ నిత్య యాటిట్యూడ్ దర్శక నిర్మాతల్నీ, హీరోల్నీ బాగా ఇబ్బంది పెడుతోందని సమాచారం. అందుకే నిత్యతో సినిమా అంటే హీరోలు సైతం హడలిపోతున్నార్ట. ‘సినిమా మొత్తం తనదే డామినేషన్ ఉంటుంది’ అనే కారణం హీరోలదైతే, చెప్పిన మాట వినదన్న కోపం దర్శకులది. అలా.. నిత్య చాలా అవకాశాల్ని కోల్పోవాల్సి వస్తోంది.
దానికి తోడు సినిమా సినిమాకీ బాగా బొద్దుగా తయారవుతోంది నిత్య. ఆమె మంచి నటినే కావొచ్చు. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుండాలి కదా? హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదరాలంటే.. నిత్య కాస్త ఒళ్లు తగ్గించుకోవాలి. ఈ విషయం నిత్యకు సలహా ఇచ్చినా ‘నాలో నటన చూస్తారు గానీ, నా గ్లామర్కాదు’ అని సమాధానం చెబుతోందట. సెట్లో దర్శకుల్ని ఇబ్బంది పెట్టే విషయంలోనూ చాలాసార్లు నిత్య విమర్శల పాలవుతోంది. దాంతో నిత్యకు క్రమంగా అవకాశాలు తగ్గుతున్నాయని టాలీవుడ్ టాక్. ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు చిత్రం `జనతా గ్యారేజ్` మాత్రమే. అది కూడా వచ్చి వెళ్లిపోతే నిత్య ఖాళీనే. నిత్య తన యాటిట్యూట్ తగ్గించుకొని.. కాస్త బాడీ కూడా అదుపులో పెట్టుకొంటే తప్ప – తన ఉనికిని కాపాడుకోవడం కష్టమే.