అది… 22 ఏప్రిల్ 2016. హైదరాబాదులో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, పోస్టర్లను తొలగించాలని రాష్ట్ర మంత్రి హోదాలో కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా చెప్పారు. అధికార పార్టీ పోస్టర్లు, ఫ్లెక్సీలైనా సరే తొలగించి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అది… 24 జులై 2016. సాక్షాత్తూ అదే మంత్రి గారి పుట్టిన రోజు. హైదరాబాద్ నగరం నిండా ఆయన ఫొటోలతో పోస్టర్లు, ఫ్లెక్సీలు కటౌట్లు వెలిశాయి. రకరకాల పదవుల్లో ఉన్న వాళ్లు లేని వాళ్లు యథాశక్తి పోస్టర్లను వేయించారు. ఫ్లెక్సీల సంగతి సరేసరి. కటౌట్లూ షరా మామూలే.
హైదరాబాదును విశ్వనగరం చేస్తామన్న కేసీఆర్ సర్కార్ మాటలను, ఇప్పుడు జరుగుతున్న చేతలను చూస్తే ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. తమ మాటలను తామే ఉల్లంఘించడంలో తెరాస వారు తమకు తామే సాటి అనిపించుకుంటున్నారు. ఆదివారం నాడు హైదరాబాదు గోడలను ఖరాబు చేసిన తీరు దారుణం. వెంటనే వాటిని తొలగించాలని శనివారం సాయంత్రం మంత్రిగారు ఆదేశించారట. మీడియా కెమెరాల ముందు పోజిస్తూ కొర్నొరేషన్ సిబ్బంది కొన్నింటిని తొలగించి మమ అనిపించి వెళ్లిపోయారు.
తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక సందర్భాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయడం మామూలైపోయింది. పుట్టిన రోజని, ఇంకో రోజని, ఫలానా నాయకుడు పార్టీలో చేరే రోజని ఎటు చూసినా కటౌట్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లే దర్శనమిస్తుంటే ఇది విశ్వనగరం అంటారా కేటీఆర్ గారూ?
నిజంగా కేటీఆర్ కు చిత్తశుద్ధే ఉంటే, తాను ఆదేశించిన తర్వాత కూడా పోస్టర్లు వెలుస్తున్నాయి, మరి ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టారని ఆరా తీశారా? తీసి ఉంటే ఆయన పుట్టిన రోజునాడు హైదరాబాదు గోడలను ఇంత అడ్డగోలుగా ఖరాబు చేస్తారా? కేటీఆర్ పుట్టిన రోజునాడు గోడలు ఏ స్థాయిలో ఖరాబైపోయాయంటే, ఎంతో మంది ట్విటర్ యూజర్లు ఫొటోలు తీసి అప్ లోడ్ చేశారు. కేటీఆర్ గారూ ఇదేనా మీ పనితీరు అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మాత్రం ఏం లాభం?
ఇదో రకం గ్లోబల్ సిటీ అని మనం సంబర పడాలేమో?
వాట్ ఎ పిటీ!!