ఈమధ్య ఆడియో వేడుకపై తారలంతా పొరపాటున నోరు జారేస్తున్నారు. అది చూసేవాళ్లకు తమాషాగా అనిపిస్తోంది. దాంతో పాటు… బోల్డంత ఫ్రీ పబ్లిసిటీ కూడా జరిగిపోతోంది. బాబు బంగారం ఆడియో ఫంక్షన్లోనూ వెంకటేష్ కాస్త నోరు జారాడు. ‘ఏం పీకలేయకపోయా..’ అంటూ వినడానికి కాస్త ఇబ్బందిగా ఉండే డైలాగ్ ఒకటి వదిలేశాడు. తెరపై వెంకటేష్ అనర్గళంగా డైలాగులు పలుకుతాడు గానీ.. వేదికలపై మాట్లాడ్డానికి కాస్త మొహమాటం. ఈ విషయాన్ని వెంకీ కూడా ఒప్పుకొంటాడు. ‘బాబు బంగారం’ ఆడియో ఫంక్షన్లో అదే జరిగింది. ఈ వేడుకలో వెంకటేష్ మాట్లాడ్డానికి మైకు అందుకోగానే… అభిమానులు కేరింతలు కొట్టారు. ”ముఫ్ఫై ఏళ్లుగా స్టేజీ ఎక్కి ఏం పీకలేకపోయా.. ఇప్పుడేం పీకుతా” అన్నారు సరదాగా. ఆయన ఉద్దేశంలో పీకడం అంటే మాట్లాడ్డమే అయినా.. స్టేజీ పై ఉన్నవాళ్లకు మీడియాకూ ఆ పదం కాస్త ఇబ్బందిగా అనిపించింది. స్పీచ్‌లు ప్రిపేర్ అయి రావడం నాకు నచ్చదు.. అది వెంకీ కాదు. నాకు ఏం తోస్తే అదే మాట్లాడతా.. అంటూ కాస్త సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాడు వెంకీ! అభిమానుల కళ్లల్లో ఆనందం చూడ్డం కోసమే ఇలాంటి వేడుకలకు వస్తా అన్న వెంకటేష్ మాటలు అభిమానుల్ని కాస్త ఊరడించినా.. ‘పీకలేకపోయా’ అనే సౌండ్ మాత్రం వాళ్లని ఇబ్బంది పెట్టే ఉంటుంది. బాబు వెంకటేష్.. మాట్లాడుతున్నప్పుడు కాస్త చూసుకోవయ్యా..!