గత ఏడాది అక్టోబరులో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేపి ఓలి ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వానికి మావోయిస్టులు మద్దతు ఉపసంహరించుకోగానే ప్రతిపక్షాలు ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. నేపాల్ పార్లమెంటులో ఓలి ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవలసి ఉండగా అంతకు ముందే అయన తన పదవికి రాజీనామా చేశారు.
ఆ సందర్భంగా పార్లమెంటు సభ్యులని ఉద్దేశ్యించి చేసిన ప్రసంగంలో ఆయన తన ప్రభుత్వాన్ని కూల్చివేత వెనుక భారత్ కుట్ర ఉందన్నట్లు మాట్లాడారు. తను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ పై ఆధారపడకుండా ఉండేవిధంగా నేపాల్ ని తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నందునే, తనకి వ్యతిరేకంగా భారత్ కుట్రలు చేసినట్లు మాట్లాడారు. దేశాన్ని ఒక ప్రయోగశాలగా మార్చడానికి ప్రతిపక్షాలని భారత్ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. తను అధికారంలోకి వచ్చిన తరువాత భారత్, చైనాలతో సంబంధాలు మెరుగుపరిచానని కానీ అందుకు శిక్ష అనుభవిస్తున్నానని అవేదన వ్యక్తం చేశారు. నేపాల్ అంతర్గత వ్యవహారాలలో భారత్ జోక్యం చేసుకొంటోందని, దానిని సహించమని అన్నారు. నేపాల్ ప్రధానిగా మావోయిస్ట్ అధినేత ప్రచండ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆయన భారత్ పేరు పెట్టి నేరుగా విమర్శించనప్పటికీ, ఆయన మాటల సారాంశం వింటే భారత్ ని ఉద్దేశ్యించే ఆరోపణలు చేశారని స్పష్టం అయ్యింది.
గత ఏడాది నేపాల్ ప్రభుత్వం తయారుచేసిన కొత్త రాజ్యాంగాన్ని దేశంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆ దేశంలో స్థిరపడిన భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. నేపాల్ ప్రధాని కెపి ఓలి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ పట్ల విముఖత ప్రదర్శిస్తూ చైనాకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. సహజంగానే అందుకు భారత్ ఆగ్రహించింది. తత్ఫలితంగా నేపాల్ కి నిత్యవసర సరుకులు రవాణాపై కొన్ని ఆంక్షలు విధించింది. ఆ కారణంగా నేపాల్ చాలా ఇబ్బందిపడింది. దానిని మంచి అవకాశంగా మలుచుకొని, చైనా ప్రభుత్వం కొన్ని వందల ట్రక్కులలో నేపాల్ కి నిత్యావసర సరుకులు సరఫరా చేసి నేపాల్ కి దగ్గరయింది. రెండు నెలల క్రితం నేపాల్ రాష్ట్రపతి బిద్యాదేవీ బండారి భారత పర్యటనని ఎటువంటి కారణం చెప్పకుండా ఆఖరి నిమిషంలో నేపాల్ ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్-నేపాల్ మధ్య దూరం ఇంకా పెరిగింది.
నేపాల్ కి కమ్యూనిస్టు దేశమైన చైనా అండగా నిలిచి ఉన్నప్పుడు, దాని అంతర్గత వ్యవహారాలలో భారత్ కంటే చైనాయే జోక్యం చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చైనా వామపక్ష ధోరణికి అనుకూలంగా ఉండే మావోయిస్టులే నేపాల్లో అధికారంలో ఉండాలని చైనా కోరుకొని ఉంటే అసహజమేమీ లేదు. బహుశః అందుకే మావోయిస్ట్ అధినేత ప్రచండకి చైనా ప్రభుత్వమే సహకరించి ఉండవచ్చు. ఆ కారణంగానే ఈ సంక్షోభం ఏర్పడి ఉండవచ్చు. చైనా రాజ్యకాంక్ష తెలిసి కూడా భారత్ పట్ల వ్యతిరేకత కారణంగా నేపాల్ దానికి దగ్గరవడం ఒక పొరపాటనే చెప్పవచ్చు.
భారత్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అనేక దశాబ్దాలుగా నేపాల్ కి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తూనే ఉన్నాయి. ఆ సంగతిని విస్మరించి, కొందరు భారత, నేపాల్ ఉన్నతాధికారులు చేసిన పొరపాట్ల కారణంగా రెండు దేశాల మద్యన ఏర్పడిన దూరాన్ని నేపాల్ ప్రధాని ఓలి తగ్గించే ప్రయత్నం చేయకపోగా ఇంకా పెంచుకొన్నారు. ఆయన చైనా గొడుగు నీడలో ఉన్నామని అనుకొంటున్నారే తప్ప అది పాము పడగా నీడ అని గుర్తించలేక పోయారు. అందుకే నేడు ఆయనకి ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పకతప్పదు. అయన చేసిన పొరపాట్లకి నేపాల్ మూల్యం చెల్లించవలసి వస్తోంది. కనుక ఆయన భారత్ ని నిందించడం కంటే తనని తానే నిందించుకోవలసి ఉంటుంది.