మెదక్ జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై చాలా జోరుగా రాజకీయాలు సాగుతున్నాయి. దానిని వ్యతిరేకిస్తూ నిర్వాసితులు నిన్న ధర్నా చేసినప్పుడు, వారిపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు నిరసనగా ఇవ్వాళ్ళ మెదక్ జిల్లా బంద్ కి ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి.
తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు కూడా ప్రభుత్వ చర్యలని తీవ్రంగా నిరసించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు సమస్యలని అధ్యయనం చేసేందుకు ఇవ్వాళ్ళ వాళ్ళు ఆ ప్రాంతంలో పర్యటించబోతున్నారు.
ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం మంత్రి హరీష్ రావు స్వయంగా అక్కడి గ్రామ ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో అనేకసార్లు మాట్లాడారు. ఆ ప్రాజెక్టు క్రింద ముంపుకి గురయ్యే 5 గ్రామాలని వేరే చోట పునర్నిర్మించి ఇచ్చి వారు కోరిన విధంగానే నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి చెప్పారు. అందుకు ఆ గ్రామస్తులు కూడా అంగీకరించారని, కానీ ప్రతిపక్షాలే వారిని రెచ్చగొట్టి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు.
అసలు ఆ ప్రాజెక్టు నిర్మించవలసిన అవసరమే లేదని, తెరాస నేతలు జేబులు నింపుకోనేందుకే దానిని నిర్మిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. నిర్వాసితులకి తగిన నష్టపరిహారం చెల్లించకుండా రైతుల భూములు గుంజుకోవాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెదేపా వాదిస్తోంది. ఆ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అభ్యంతరాలువ్యక్తం చేస్తూ, లోపాలని ఎత్తి చూపిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు వాటి గురించి ఆలోచించడం లేదని తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్ వంటి మేధావులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుపై ఇంత వివాదం చెలరేగుతున్నప్పుడు, ప్రభుత్వం కొంచెం సంయమనం పాటించి ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావుల సహకారం తీసుకొని ఉంటే ఈ సమస్యకి పరిష్కారం దొరికి ఉండేది. కానీ ప్రొఫెసర్ కోదండరాంని చాలా కాలంగా దూరంగా ఉంచడమే కాకుండా ఇటీవల ఆయనపై తెరాస నేతలు చాలా తీవ్ర విమర్శలు చేసిన కారణంగా ప్రభుత్వం ఇప్పుడు ఆయన సహాయం కోరలేకపోతోంది.
ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణా ప్రభుత్వం అనవసరంగా పంతానికి పోతున్నందున, తెలంగాణా ఏర్పడినప్పటికీ ప్రజలపై దౌర్జన్యం, అణచివేత, దోపిడీకి గురవుతున్నారని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేస్తున్న విమర్శల వలన చెడ్డపేరు మూటగట్టుకొంటోంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసం అభివృద్ధికి అడ్డుపడుతున్నాయనే అపవాదు మూటగట్టుకొంటున్నాయి. వెరసి అధికార, ప్రతిపక్షాలు రెంటికీ చెడ్డపేరు వస్తోంది. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవడమే ఏకైక పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. నిర్వాసితులని అధికార, ప్రతిపక్షాలు ఆడుకొంటున్న ఈ రాజకీయ చదరంగంలో పావులుగా మారకుండా కాపాడవలసిన బాధ్యత ప్రొఫెసర్ కోదండరాంవంటి మేధావుల పైనే ఉంది.