కాపు నేత ముద్రగడ పద్మనాభం 12 రోజులు నిరాహార దీక్ష చేసి తుని విధ్వంసం కేసులో ఏపి సిఐడి పోలీస్ అరెస్ట్ చేసిన 13మందిని విడిపించుకోవడం, ఆ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగిన రాజకీయాలని అందరూ చూశారు. ముద్రగడ దీక్షతో వేడెక్కిన రాజకీయాలు, ఆయన దీక్షతో విరమించగానే ఒక్కసారిగా చల్లబడిపోయాయి. ఆ తరువాత వాటి గురించి ముద్రగడతో సహా అధికార, ప్రతిపక్షాలలో ఎవరూ కూడా మాట్లాడలేదు.
మళ్ళీ చాలా రోజుల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తుని విద్వంసం కేసుల గురించి నిన్న సిఐడి అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడారు. తుని విధ్వంసానికి భాద్యులైన వారినందరినీ వీలైనంత త్వరగా గుర్తించి, అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఎవరినీ ఉపేక్షించవద్దని పోలీసులని గట్టిగా హెచ్చరించారు.
తుని విధ్వంసంలో సిఐడి పోలీసులు 69 కేసులు, రైల్వే పోలీసులు వేరేగా 5 కేసులు నమోదు చేశారు. వాటిలో 13మంది అనుమానితులని అరెస్ట్ చేశారు. కానీ ముద్రగడ ఒత్తిడికి తలొగ్గి అందరినీ విడుదల చేశారు. ఒకవేళ మళ్ళీ ఎవరినైనా అరెస్ట్ చేస్తే ముద్రగడ తప్పకుండా మళ్ళీ దీక్షకి కూర్చోనే అవకాశం ఉంది. అటువంటి తీవ్ర నేరాలకి పాల్పడినవారిని పట్టుకొని న్యాయస్థానం ముంది నిలబెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కనుక ముఖ్యమంత్రిని తప్పు పట్టలేము కానీ, ఆవిధంగా చేస్తే ఎటువంటి పరిణామాలు ఏర్పడుతాయో తెలిసి కూడా ముఖ్యమంత్రి సిఐడి పోలీసులని ఆవిధంగా ఆదేశించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకు కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
కాపులకి రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ కమీషన్ ఇంతవరకు తన పని మొదలుపెట్టలేదు. జస్టిస్ మంజునాథ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సర్వే నివేదిక కోసం ఎదురుచూస్తునట్లు స్వయంగా చెప్పారు. దాని ఆధారంగానే కాపులకి రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా? అనే దానిపై నివేదిక తయారు చేస్తానని చెప్పారు. కానీ సాంకేతిక కారణాల వలన ఆ సర్వే ముందుకు సాగడం లేదు. అది ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.
ఆగస్ట్ నెలాఖరులోగా మంజునాథ కమీషన్ నివేదికని సమర్పించాలని, దానిపై శాసనసభ సమావేశాలలో తీర్మానం చేయాలని ముద్రగడ ఇదివరకే హెచ్చరించారు. ఆ గడువు దగ్గర పడుతున్నప్పటికీ, పైన చెప్పుకొన్న కారణం చేత ఇంతవరకు మంజునాథ కమీషన్ నివేదిక సిద్దం కాలేదు. కనుక ముద్రగడ మళ్ళీ పోరాటం మొదలుపెడితే ఆయనని అడ్డుకొనేందుకే ముఖ్యమంత్రి తుని విధ్వంసానికి బాధ్యులని గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుతున్నారేమో? ఒకవేళ పోలీసులు మళ్ళీ ఎవరినైనా అరెస్ట్ చేసినట్లయితే, ముద్రగడ కాపులకి రిజర్వేషన్ల కోసం కాక, వారి విడుదల కోసమే పోరాడవచ్చు. ఆవిధంగా ఆయన పోరాటాన్ని పక్కదారి పట్టించవచ్చనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి తుని ఘటనల దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులని అరెస్ట్ చేయమని ఆదేశించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.