గడప గడపకి వైఎస్సార్ సీపీ అంటూ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పై బాగా హడావుడి చేస్తోంది జగన్ పార్టీ. చంద్రబాబు పాలనపై వంద ప్రశ్నలు అంటూ ఒక పాంప్లేట్ తయారు చేసి.. దాన్ని జనాలకు ఇచ్చి సమాధానాలు తీసుకొంటున్నాం.. వంద హామీల అమలు విషయంలో బాబుకు పడుతున్నది సున్నా మార్కులే అంటూ జగన్ తో సహా ఆ పార్టీ నేతలంతా హడావుడి చేస్తున్నారు. ప్రతిపక్షంగా పని ప్రారంభించి ఐదారేళ్లు అయినా ఇంత వరకూ వైకాపా తరుపున ఏ కార్యక్రమం చేసినా అందులో జగన్ మాత్రమే కనపించేవాడు! కిరణ్ హయాంలో ప్రభుత్వంపై దాడికి ఏ ప్రోగ్రామ్ ను చేపట్టినా, చంద్రబాబు హయాంలో ఏ ప్రోగ్రామ్ చేపట్టినా.. జగన్, జగన్ అన్నట్టుగా మాత్రమే ఉండేది పరిస్థితి.
అయితే తొలి సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక కార్యక్రమంలో క్యాడర్ లో కదలిక కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం తీరును గుర్తు చేస్తూ.. వైకాపా నేతలు గ్రామాల, వార్డుల బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ గురించి సోషల్ మీడియాలో కూడా వైకాపా హడావుడి చేస్తోంది. గ్రామాల్లోకి వెళ్లిన వైకాపా నేతలు తమ కార్యక్రమ తీరును ఫొటోలుగా వీడియోలుగా ఫేస్ బుక్ లోకి అప్ లోడ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో వైకాపా వాళ్లకు కొన్ని ఆయుధాలు దొరుకుతున్నాయి. గ్రామాల్లో చంద్రబాబును ఎవరైనా తిడితే.. దాన్నివీడియోగాతీసి సోషల్ సైట్లలోకి అప్ లోడ్ చేస్తున్నారు! రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంశాల్లో చంద్రబాబుపై జనాల్లో పీకల స్థాయి కోపం ఉన్న సంగతిని ఎవరూ కాదనలేరు. ప్రత్యేకించి అప్పులతో ముడిపడిన వ్యవహారం కావడం, బాబు అధికారంలోకి వస్తే ఆ అప్పులనుతాము చెల్లించాల్సిన అవసరం ఉండదని రైతులు, మహిళలు భావించడం..తీరా బాబు వచ్చాకా అవి మాఫీ కాకపోగా, వడ్డీలు పెరిగిపోయి తమ నెత్తికి భారం పెరగడంతో ఈ వర్గాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అలాంటి వాళ్లు జనాలు సీఎంను తిట్టడానికి వెనుకాడరు కూడా! పల్లెల్లోని అని అలాంటి అసంతృప్తుల తిట్లను వీడియోగారికార్డు చేసి సోషల్ సైట్లలోకి అప్ లోడ్ చేస్తున్నారు వైకాపా వాళ్లు. తెలుగుదేశం పార్టీని ఇది ఇరకాటంలో పడేసే వ్యవహారమే!