మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై పోలీసులు నిన్న లాఠీ చార్జ్ చేసినందుకు నిరసనగా నేడు మెదక్ జిల్లా బంద్ కి ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మల్లన్న సాగర్ నిర్వాసితులతో కలిసి నేడు ధర్నా చేయడానికి బయలుదేరగా ఆయనని మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అ కారణంగా ప్రతిపక్షాలు తమ ఆందోళనలని మరింత ఉదృతం చేయడానికి తెరాస ప్రభుత్వమే మరో అవకాశం కల్పించినట్లయింది. గతంలో ఆయనపై కొందరు మంత్రులు, తెరాస నేతలు తీవ్ర విమర్శలు చేసినందుకే అన్ని వర్గాల నుంచి ప్రభుత్వంపై ప్రతివిమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు ఆయనని అరెస్ట్ చేయడంతో తెరాస ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తోందనే ప్రతిపక్షాల ఆరోపణలకి బలం చేకూరినట్లయింది. ఇప్పుడు ఒకవేళ ప్రజాసంఘాలు కూడా నిర్వాసితులకి, ప్రొఫెసర్ కోదండరాంకి మద్దతుగా రంగప్రవేశం చేసినట్లయితే సమస్య ఇంకా జటిలం అవుతుంది. తెరాస ప్రభుత్వ ప్రతిష్ట ఇంకా మసక బారుతుంది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్న వారిని అడ్డుకొనేందుకు, ఆ ప్రాజెక్టుకి మద్దతుగా కొందరు రైతుల చేత ఊరేగింపులు జరిపిస్తోంది. జిల్లాలో బంద్ జరుగుతున్న ఈ సమయంలో కూడా కొంతమంది ఆ ప్రాజెక్టుకి అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాని వలన ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం దక్కకపోగా, ప్రభుత్వం కూడా తెర వెనుక రాజకీయాలు చేస్తోందనే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఈ ప్రాజెక్టు విషయంలో తెరాస ప్రభుత్వం ఇకనైనా ఆచి తూచి అడుగులు వేయడం మంచిది.