నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఆమాద్మీ పార్టీ తరపున పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం రావడంతో భాజపాకి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఆమాద్మీ పార్టీ నేతలెవరూ ఆ వార్తలను దృవీకరించలేదు. అలాగని ఖండించలేదు కూడా. సిద్ధూ కూడా దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆయన ఇంకా ఆమాద్మీ పార్టీలో చేరకపోవడం, ఆమాద్మీ నుంచి కూడా ఇంతవరకు ఆయనకి ఎటువంటి ఆహ్వానం రాకపోవడంతో, తెర వెనుక జరుగుతున్న చర్చలు ఇంకా ఫలించలేదనో లేదా బెడిసికొట్టాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవ్వాళ్ళ మీడియాతో సిద్ధూ మాట్లాడిన మాటలు కూడా అదే సూచిస్తున్నాయి.
“ఒక పక్షి ఎన్నడూ తన గూడు వీడి దూరంగా ఉండాలనుకోదు. నేను కూడ అంతే. నన్ను నా పంజాబ్ రాష్ట్రానికి దూరంగా ఉండమన్నారు. నా మూలాలు పంజాబ్ లో ఉన్నప్పుడు నేను నా రాష్ట్రానికి ఏవిధంగా దూరంగా ఉండగలను? అసలు ఎందుకు దూరంగా ఉండాలి? నేను ఏమి తప్పు చేశానని నా మాతృభూమికి దూరంగా ఉండాలి? నాకు నా రాష్ట్రం కంటే ఏ పార్టీ కూడా ముఖ్యం కాదు. అందుకే నేను నా పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసేశాను. పంజాబ్ ప్రయోజనాలకి ఏ పార్టీ కట్టుబడి ఉంటే ఆ పార్టీయే నాది. నా రాష్ట్రం కోసం నేను ఎన్ని కష్టాలైనా భరించడానికి సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు.
సిద్ధూ చెపుతున్న ప్రకారం చూస్తే భాజపా అధిష్టానం ఆయనని పంజాబ్ రాజకీయాలకి దూరంగా ఉండమని కోరినట్లు అర్ధమవుతోంది. కానీ ఆ మాటలు నమ్మశక్యంగా లేవు. ఏ రాజకీయ పార్టీ కూడా తన నేతలని తన స్వరాష్ట్రానికి, నియోజక వర్గానికి దూరంగా ఉండమని కోరదు. ఆ అవసరం లేదు. ఉండదు కూడా. కనుక సిద్ధూ మాటలు అబద్దమని స్పష్టం అవుతోంది.
ఇక రాజ్యసభ సభ్యుడుగా ఉన్నంత మాత్రాన్న ఆయన తన రాష్ట్రానికి దూరమైపోయినట్లు ఏవిధంగా భావిస్తున్నారో అర్ధం కాదు. నిజానికి రాజ్యసభ సీటు కోసం ఆయనే భాజపా వెంటపడి దక్కించుకొన్నారు. వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికలలో సిద్ధూ వంటి మంచి పేరు ప్రతిష్టలు, ప్రజలని ఆకట్టుకోగల మంచి మాటకారితనం ఉన్న వ్యక్తి సేవలని ఉపయోగించుకొని లాభాపడాలనే భాజపా ఆలోచిస్తుంది తప్ప ఆయనని దూరంగా పెట్టాలనుకాదు కదా? కనుక సిద్ధూ వేరే కారణంతో రాజీనామా చేసినట్లు స్పష్టం అవుతోంది. దానికి రెండు కారణాలు కనబడుతున్నాయి. 1. తనని పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని భాజపాని కోరితే అది తిరస్కరించడం వలన కావచ్చు. 2.అదే సమయంలో ఆమాద్మీ నుంచి ఆహ్వానం అందుకోవడం వలన కావచ్చు. ఆ కారణాలు చెప్పకుండా దేశభక్తి..పంజాబ్ ప్రయోజనాలు..చెట్లు..చిలకలు అంటూ ఏదేదో స్టోరీలు చెపుతున్నాడు. ఆయన చెప్పే ఈ స్టోరీల వెనుక సాగిన అసలు స్టోరీ గురించి కూడా త్వరలోనే ఆయనే చెప్పడం ఖాయం. అంతవరకు ఆయన చెప్పే ఈ సోదిని భరించక తప్పదు.