వరస ఫిరాయింపులు.. తన కుటుంబంలోని వ్యక్తులనుకున్న వాళ్లు కూడా షాకులిచ్చే సరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చాలా నిరుత్సాహానికే గురయ్యాడు. ఈ విషయంలో తన ఆవేదనను జగన్ బయటకే చెప్పేశాడు కూడా. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అనేక మంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే హోదాల్లో, ఎమ్మెల్సీ పదవులతో వాళ్లు తెలుగుదేశం దిశగా వెళ్లిపోయారు. ఇలా వెళ్లిన వారందరిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అదేమిటంటే.. వాళ్లు వచ్చింది వయా తెలుగుదేశం కావడం!
2004 వరకూ తెలుగుదేశంలో పని చేసిన వాళ్లు, అప్పుడు ఆ పార్టీ ఓడటంతో దాన్ని వీడిన వారు, ప్రజారాజ్యం ఆవిర్భావంతో అటువైపు వెళ్లిపోయిన వాళ్లు.. జగన్ పార్టీ ఆవిర్భావంతో తెలుగుదేశం నుంచి, ప్రజారాజ్యం మీదుగా.. దీంట్లో వచ్చి చేరిన వారు! ఇలాంటి వాళ్లే ఈ మధ్యన జగన్ పార్టీని వీడి బయటకు వెళ్లిపోయారు! వైఎస్సార్ సీపీని వీడిన ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది మూలాలు తెలుగుదేశంలోనే ఉండటం గమనార్హం. ఈ ఫిరాయింపుదారుల రాజకీయ ప్రస్థానంలో 2004 కు ముందు చరిత్రను చూస్తే.. అదంతా తెలుగుదేశంతో ముడిపడి ఉన్నదే!
తమ పార్టీలో ఒకప్పుడు పని చేసిన ఇలాంటి వాళ్లందరినీ తెలుగుదేశం తిరిగి రప్పించుకోగలిగింది. జగన్ పార్టీ తరపున గెలిచిన వాళ్లను ఆ హోదాలతో తన వైపుకు తిప్పుకోగలిగింది. ఈ నేపథ్యంలో జగన్ కు తత్వం బోధపడిందని సమాచారం. తన పార్టీ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లు, కాంగ్రెస్ నుంచి తన పార్టీలోకి వచ్చిన వారు తప్ప.. మిగిలిన తెలుగుదేశం వర్గం అంతా అటువైపు వెళ్లిపోతుందని జగన్ కు స్పష్టత వచ్చిందని సమాచారం. అందుకే ఇప్పుడు పార్టీలో ఆ కేటగిరితో ఉన్న వ్యక్తులను జగన్ నమ్మడం మానేశాడని సమాచారం. ఇది వరకూ ఆదిరెడ్డి అప్పారావు ఇచ్చిన స్టేట్ మెంటు, తాజాగా చిత్తూరు జిల్లా మాజీ ఎమ్మెల్యేప్రవీణ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గపు బాధ్యతల నుంచి తప్పించడం..వంటి వ్యవహారాలు జగన్ వైఖరిలో మార్పుకు రుజువులుగా నిలుస్తున్నాయి.